రైతుల ఆందోళన: అథ్లెట్ల ‘అవార్డు వాపసీ’కి అడ్డు

ప్రభుత్వం అందజేసిన 35 జాతీయ పురస్కారాలను వాపస్‌ ఇచ్చేందుకు రాష్ట్రపతి భవన్‌కు బయల్దేరిన క్రీడాకారులను పోలీసులు నిలువరించారు. వీరంతా ఆదివారం దిల్లీకి చేరుకున్నారు. సోమవారం ప్రెస్‌క్లబ్‌ నుంచి బయల్దేరిన వారిని కృషిభవన్‌ వద్ద అడ్డగించి వెనక్కి పంపించేశారు...

Published : 07 Dec 2020 21:15 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం అందజేసిన 35 జాతీయ పురస్కారాలను వాపస్‌ ఇచ్చేందుకు రాష్ట్రపతి భవన్‌కు బయల్దేరిన క్రీడాకారులను పోలీసులు నిలువరించారు. వీరంతా ఆదివారం దిల్లీకి చేరుకున్నారు. సోమవారం ప్రెస్‌క్లబ్‌ నుంచి బయల్దేరిన వారిని కృషిభవన్‌ వద్ద అడ్డగించి వెనక్కి పంపించేశారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన రైతులకు మద్దతుగా వీరు ‘అవార్డు వాపసీ’ కార్యక్రమం చేపట్టడమే ఇందుకు కారణం.

రెండుసార్లు ఆసియా క్రీడల్లో స్వర్ణాలు అందుకున్న మాజీ రెజ్లర్‌ కర్తార్‌సింగ్‌ ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. ఆయన 1982లో అర్జున, 1987లో పద్మశ్రీ అందుకున్నారు. ఒలింపిక్‌ స్వర్ణం గెలిచిన హాకీ మాజీ ఆటగాడు గుర్మైల్‌ సింగ్‌, హాకీ మహిళల జట్టు మాజీ సారథి రాజ్‌బీర్‌ కౌర్ సైతం కర్తార్‌తో రాష్ట్రపతి భవన్‌కు బయల్దేరిన బృందంలో ఉన్నారు. 2014లో గుర్మైల్‌ ధ్యాన్‌చంద్‌, 1984లో రాజ్‌బీర్‌ అర్జున అందుకోవడం గమనార్హం.

‘రైతులు ఎప్పుడూ మాకు అండగానే ఉన్నారు. వారినిప్పుడు లాఠీఛార్జ్‌ చేయడం చూస్తుంటే బాధేస్తోంది. హక్కుల కోసం వారిప్పుడు రహదారులపై వణికించే చలిలో కూర్చుకున్నారు’ అని కర్తార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు శాఖలో ఐజీ హోదాలో ఉన్నా తానిప్పటికీ వ్యవసాయం చేస్తున్నానని పేర్కొన్నారు. రైతులు వ్యతిరేకిస్తున్న ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ చట్టాల్లో సంస్కరణలు అవసరమే అయినా సంతోషంగా లేని చట్టాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు.

రైతు నిరసనలకు మద్దతుగా పంజాబ్‌, హరియాణాకు చెందిన కొందరు క్రీడాకారులు గళం విప్పుతున్నారు. అందులో భాగంగా అర్జున, ధ్యాన్‌చంద్‌ వంటి పురస్కారాలను వాపస్‌ ఇచ్చేందుకు వీరంతా సిద్ధమయ్యారు. తనకిచ్చిన పురస్కారాలను సైతం వెనక్కి ఇస్తానని ఒలింపిక్‌ పతకం గెలిచిన బాక్సర్‌ విజేందర్‌సింగ్‌ హెచ్చరించిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి

ఏడాదిగా కోహ్లీసేన జైత్రయాత్ర.. 
నట్టూ ఒక్కడే మనసులు గెలిచాడు

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని