Updated : 26/11/2020 13:05 IST

క్యాస్ట్రో మరణించిన సరిగ్గా నాలుగేళ్లకు డీగో..!

ఒకే తేదీన స్నేహితుల మరణం

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒకరేమో ఫుట్‌బాల్‌ దిగ్గజం. మరొకరేమో రాజకీయ దిగ్గజం. ఇద్దరివీ వేర్వేరు దేశాలు, భిన్న నేపథ్యాలు. కానీ, ఒకరంటే మరొకరికి ఎంతో గౌరవం. స్నేహంతో ఒక్కటైన ఆ ఇద్దరు అంతకుమించి అనుబంధం ఏర్పర్చుకున్నారు. చివరికి ఒకే రోజు(నవంబర్‌ 25) ప్రాణాలు విడిచి మరణంలోనూ ఒక్కటయ్యారు. ఆ ఇద్దరే అర్జెంటీనాకు చెందిన ఫుట్‌బాల్‌ లెజెండ్‌ డీగో మారడోనా, క్యూబా మాజీ దేశాధినేత ఫిడెల్‌ క్యాస్ట్రో. డీగో బుధవారం తుదిశ్వాస విడువగా క్యాస్ట్రో సరిగ్గా నాలుగేళ్ల కిందట ఇదే రోజు కన్నుమూశారు. 

స్నేహితులే కాదు అంతకుమించి..
క్యూబా దివంగత నేత ఫిడెల్‌ క్యాస్ట్రో అంటే డీగోకు అమితమైన గౌరవం. నాలుగేళ్ల కిందట ఆయన మృతిచెందారని తెలిసి ఈ అర్జెంటీనా స్టార్‌ కంటతడి పెట్టాడు. తన తండ్రి మృతి తర్వాత అంతటి బాధ కలిగించిన సంఘటన ఇదేనని అప్పట్లో పేర్కొన్నాడు. అయితే, డీగో అంతలా భావోద్వేగం చెందడానికి ఓ బలమైన కారణమే ఉంది. అతడాడే రోజుల్లో మత్తు పదార్థాలకు బానిసవ్వగా 1991లో డోపింగ్‌ పరీక్షల్లో పట్టుబడ్డాడు. దాంతో 15 నెలల పాటు నిషేధం వేటు పడి ఆటకు దూరమయ్యాడు. ఆ తర్వాత కూడా డీగో వాటి జోలికి వెళ్లకుండా ఉండలేకపోయాడు. దీంతో పలుమార్లు అనారోగ్యానికి గురై దాదాపు మృత్యువు అంచుల వరకూ వెళ్లాడు. అలాంటి పరిస్థితుల్లోనే తన చికిత్సకు చేయూతనందించిన ఫిడెల్‌ క్యాస్ట్రో తండ్రి తర్వాత తండ్రి అంతటివాడని ఆ సందర్భంలో డీగో పేర్కొన్నాడు.

ఆ స్నేహం చిగురించింది అప్పుడే..
డీగో 1986 ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనాను గెలిపించాక తన అభిమాన కమ్యూనిస్ట్‌ నేత ఫిడెల్‌ క్యాస్ట్రోను తొలిసారి కలిశాడు. తర్వాత వారిద్దరూ పెద్దగా కలవకపోయినా ఫిడెల్‌ అంటే అతడికి అభిమానమే. అయితే, 2000ల సంవత్సరం తర్వాత దగ్గరయ్యారు. మత్తుపదార్థాలకు బానిసైన డీగో అనారోగ్యానికి గురవడంతో అర్జెంటీనాలో చికిత్స పొందడానికి అవకాశం లేకపోయింది. అలాంటి విపత్కర సమయంలో క్యూబా అధినేత తన చికిత్సకు సహకరించారని, అలా క్యూబాలో చికిత్స పొందే సమయంలోనే తమ మధ్య స్నేహం పెరిగిందని డీగో అప్పుడు వివరించాడు. ఫిడెల్‌ తనని ఉదయపు నడకకు ఆహ్వానించేవారని, అప్పుడప్పుడూ తమ మధ్య అనేక విషయాలు చర్చకు వచ్చేవని చెప్పాడు. తామిద్దరం రాజకీయ, క్రీడా అంశాలపై లోతుగా చర్చించేవాళ్లమన్నాడు. అలా తమ స్నేహం బలపడడమే కాకుండా తన ప్రాణాలు కాపాడిన వ్యక్తి క్యాస్ట్రో అని డీగో వెల్లడించాడు.

ఆ అభిమానమే పచ్చబొట్టు వేసుకునేలా చేసింది..
డీగో ఎవర్నైనా ఇష్టపడితే తన ఒంటిమీద వారి టాటూలు వేయించుకునే అలవాటు ఉంది. ఆ కారణంతోనే తన అభిమాన నాయకుడు, తిరుగుబాటు దారుడైన చేగువేరా టాటూను కుడిచేతిపై వేయించుకున్నాడు. అలాగే ఎడమకాలి మీద ఫిడెల్‌ బొమ్మను వేసుకోవడం విశేషం.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని