విధి విచిత్రం: డెలివరీ బాయ్‌గా క్రికెటర్‌

కరోనా వైరస్‌ ప్రజల జీవితాల్ని చిన్నాభిన్నం చేసింది. ఆరోగ్య, ఆర్థిక వ్యవస్థల్ని దెబ్బతీసింది. మహమ్మారి ధాటికి ఒలింపిక్స్‌, టీ20 ప్రపంచకప్‌తో సహా మెగా క్రీడా టోర్నీలన్నీ వాయిదా పడ్డాయి. అయితే కొవిడ్‌-19 తన జీవితాన్ని ....

Updated : 16 Nov 2020 11:29 IST

దయనీయ పరిస్థితిలో నెదర్లాండ్ ఆటగాడు

ఇంటర్నెట్‌డెస్క్: కరోనా వైరస్‌ ప్రజల జీవితాల్ని చిన్నాభిన్నం చేసింది. ఆరోగ్య, ఆర్థిక వ్యవస్థల్ని దెబ్బతీసింది. మహమ్మారి ధాటికి ఒలింపిక్స్‌, టీ20 ప్రపంచకప్‌తో సహా మెగా క్రీడా టోర్నీలన్నీ వాయిదా పడ్డాయి. అయితే, కొవిడ్‌-19 తన జీవితాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో వెల్లడిస్తూ నెదర్లాండ్‌ క్రికెటర్‌ పాల్‌ వాన్‌ మీకెరెన్‌ భావోద్వేగంతో ట్వీట్ చేశాడు. దేశం తరఫున ప్రపంచకప్‌లో ప్రాతినిధ్యం వహించాల్సిన తాను ప్రస్తుతం పూట గడవడం కోసం డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాని వెల్లడించాడు.

షెడ్యూల్‌ ప్రకారం ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌ అక్టోబర్ 18 నుంచి నవంబర్‌ 15 వరకు జరగాల్సి ఉంది. అయితే, మహమ్మారి విజృంభణతో ప్రపంచకప్‌ను వాయిదా వేశారు. కరోనా లేకపోతే మెల్‌బోర్న్‌ మైదానంలో ఫైనల్‌ను వీక్షించేవారిమని ఈఎస్‌పీన్‌ క్రిక్‌ఇన్ఫో ఆదివారం ట్వీట్‌ చేసింది. దీన్ని పాల్ వాన్‌ రీట్వీట్ చేస్తూ.. ‘‘ఈ రోజు క్రికెట్‌ ఆడుతూ ఉండాల్సింది. కానీ, ప్రస్తుతం శీతకాలం నెలల్ని గడిపేందుకు ఉబర్‌ ఈట్స్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాను. విధి ఎంతో విచిత్రమైనది. పరిస్థితుల్ని మార్చేస్తుంది. అయినా నవ్వుతూ మనం ముందుకు సాగిపోవాలి’’ అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ప్రతికూలతలను అధిగమించి తిరిగి క్రికెట్‌ ఆడతావని నెటిజన్లు అతడికి ధైర్యం చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. నెదర్లాండ్స్‌లో కీలక బౌలర్‌ అయిన పాల్‌ వాన్‌ ఇప్పటివరకు 5 వన్డేలు, 39 టీ20లు ఆడారు. పొట్టిఫార్మాట్‌లో అతడు 47 వికెట్లు సాధించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని