Published : 12/06/2021 01:42 IST

నా అస్త్రం క్యారమ్‌ బాల్‌: కృష్ణప్పగౌతమ్‌

ఇంటర్నెట్ డెస్క్: జులైలో టీమ్‌ఇండియా శ్రీలంకలో పర్యటించనుంది. అక్కడ లంకతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఇందుకోసం 20 మంది ఆటగాళ్లతో పాటు ఐదుగురు నెట్‌ బౌలర్లను ఎంపిక చేసింది బీసీసీఐ. దేశవాళీ క్రికెట్‌పాటు ఐపీఎల్‌లో రాణించిన కృష్ణప్ప గౌతమ్‌, దేవదత్‌ పడిక్కల్, రుతురాజ్‌ గైక్వాడ్‌, కృష్ణప్ప గౌతమ్‌, నితీశ్ రాణా, చేతన్‌ సకారియా లాంటి ఆటగాళ్లు తొలిసారిగా టీమ్‌ఇండియాకు ఎంపికయ్యారు.  ఈ నేపథ్యంలో కృష్ణప్ప గౌతమ్‌తో ‘పీటీఐ’ ముచ్చటించింది.

‘టీమ్‌ఇండియాకు ఎంపిక కావాలనేది ఎన్నో ఏళ్ల కల. ఇప్పుడు ఆ కల నెరవేరింది. ఇంత కంటే ఆనందమైన విషయం మరొకటి ఉండదు’ అని భారత జట్టుకు మొదటిసారి ఎంపిక కావడంపై గౌతమ్‌ హర్షం వ్యక్తం చేశాడు. ‘నా కెరీర్‌ ఆరంభంలో హర్భజన్‌ సింగ్‌ని అనుసరించేవాడిని. దాంతో నా సహచర ఆటగాళ్లు నన్ను భజ్జీ అని పిలిచేవారు’ అని తన కెరీర్‌ ఆరంభంలోని విషయాలను గుర్తుచేసుకున్నాడు. మరి హర్భజన్‌ సింగ్‌లాగా ‘దుస్రా’ వేస్తావా అని ప్రశ్నించగా ‘లేదు. నేను దుస్రా వేయను కానీ ‘క్యారమ్‌ బాల్’ వేస్తా’ అని సమాధానమిచ్చాడు.

క్యారమ్‌ బాల్‌ సంధించడం రవిచంద్రన్‌ అశ్విన్‌ను చూసి నేర్చుకున్నారా అని అడిగిన ప్రశ్నకు ‘క్యారమ్‌ బాల్‌ని సంధించడం నా సొంతంగా నేర్చుకున్నా. మనం ఉన్నతంగా రాణించాలంటే సొంతంగా నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. నా చిన్నతనంలో ఎర్రపల్లి ప్రసన్న సర్‌ కూడా నాకు శిక్షణ ఇచ్చారు. అశ్విన్‌ ఆలోచన విధానం, అతడి ఆటతీరును ఇష్టపడతాను’ అని బదులిచ్చాడు.

ఐపీఎల్ 14 సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ గౌతమ్‌ని 9.25 కోట్లకు సొంతం చేసుకుంది. కానీ ఈ సీజన్‌లో కృష్ణప్పకు ఒక్క మ్యాచ్‌లో కూడా తుదిజట్టులో చోటు దక్కలేదు. ‘ఐపీఎల్‌లో నాపై ఎలాంటి ఒత్తిడీ లేదు. ఆట విషయంలో కంగారు పడవలసిన అవసరం లేదు. ధర గురించి పట్టించుకోవద్దు. మన పని మనం చేసుకుంటూ వెళ్లాలి. ఆటను ఎంజాయ్‌ చేయాలని మహీభాయ్ (మహేంద్ర సింగ్ ధోనీ) అమూల్యమైన సలహా ఇచ్చాడు. నీ సహజమైన శైలిలో ఆడు అని చెప్పేవాడు’ అని ఐపీఎల్‌ గురించి గౌతమ్‌ చెప్పుకొచ్చాడు.

ఈ ఏడాది ఆరంభంలో భారత్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగు టెస్టులకు గౌతమ్‌ నెట్‌ బౌలర్‌గా ఎంపికయ్యాడు. ఆ సమయంలో సీనియర్‌ జట్టుతో కలిసి ఉండటంపై స్పందిస్తూ.. ‘దేశంలోని నాణ్యమైన ఆటగాళ్లకు బౌలింగ్ చేయడం గొప్ప అనుభవం. దీని ద్వారా ఎంతో నేర్చుకున్నా’ అని పేర్కొన్నాడు.

కర్ణాటక తరఫున దేశవాళీ క్రికెట్‌లో  కృష్ణప్ప గౌతమ్‌ మంచి ప్రదర్శన కనబరిచాడు. ఐదు వికెట్ల ఘనతను 12 సార్లు అందుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో బ్యాట్‌తోనూ రాణించి ఆల్‌రౌండర్‌గానూ పేరు తెచ్చుకున్నాడు. ఈ అంశంపై మాట్లాడుతూ..‘దేశవాళీ క్రికెట్‌లో బలమైన జట్టుగా ఉన్న కర్ణాటక తరఫున ఆడటం నాకు ఎంతో ఉపయోగపడింది. ఇది బలమైన జట్టే కాకుండా చాలా ఆనందంగా ఉండే జట్టు. అందరం కలుపుగోలుగా ఉంటాం’ అని చెప్పాడు.

ఇక శ్రీలంక పర్యటనకు జాతీయ క్రికెట్‌ అకాడమీ డైరెక్టర్‌ రాహుల్ ద్రవిడ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. గతంలో ద్రవిడ్‌ ఇండియా ‘ఏ’ జట్టుకు కోచ్‌గా పనిచేశాడు. అప్పుడు గౌతమ్ ఆ జట్టులో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ద్రవిడ్‌తో కలిసి పనిచేయడం సులభంగా ఉంటుందని గౌతమ్‌ చెప్పాడు. ‘నేను ఇండియా ‘ఏ’కు ఆడినప్పుడు ద్రావిడ్‌ సర్ మాకు కోచ్‌గా ఉన్నారు. ఆయన ఏం ఆశిస్తాడో ఆటగాడిగా నాకు తెలుసు. ఇంతకుముందు అతని దగ్గర శిష్యుడిగా ఉండటం ఈ పర్యటనలో నాకు ఎంతో ఉపయోగపడుతుంది’ అని కృష్ణప్ప గౌతమ్‌ చెప్పుకొచ్చాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని