Amarinder: సిద్ధూని మాత్రం సీఎం కానివ్వనంతే.. అందుకు ఎలాంటి త్యాగానికైనా రె‘ఢీ’!

పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవ్‌జ్యోత్‌ సిద్ధూపై మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ యుద్ధం ప్రకటించారు......

Published : 23 Sep 2021 01:46 IST

చండీగఢ్‌: పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవ్‌జ్యోత్‌సిద్ధూపై మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ యుద్ధం ప్రకటించారు! ఎట్టిపరిస్థితుల్లో ఆయన్ను సీఎంని కానివ్వబోనన్నారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధూని కచ్చితంగా ఓడిస్తానన్నారు.సిద్ధూ ప్రమాదకర వ్యక్తి అని.. ఆయనపై బలమైన అభ్యర్థిని పోటీలో నిలబెడతానని ప్రకటించారు. సిద్ధూతో పంజాబ్‌కు, ఈ దేశానికే ప్రమాదమన్న కెప్టెన్‌.. ఆయన్ను సీఎం కానీయకుండా అడ్డుకొనేందుకు ఎలాంటి త్యాగానికైనా తాను సిద్ధమేనన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాకు అంతగా అనుభవం లేదని, వారి సలహాదారులు తప్పుదారి పట్టిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. రాహుల్‌, ప్రియాంక తన పిల్లల్లాంటివారేనన్నారు. ముగింపు ఇలా ఉండాల్సింది కాదన్న కెప్టెన్‌..  తాను తీవ్ర మనస్థాపానికి గురైనట్టు ప్రకటనలో పేర్కొన్నారు. ఎమ్మెల్యేలను గోవాకో, ఇంకే ప్రాంతానికో విమానంలో తీసుకెళ్లే పని తనకు చేతకాదని, జిమ్మిక్కులు చేయడం తెలియదన్నారు. తన గురించి గాంధీ కుటుంబానికి బాగా తెలుసన్నారు. 

పార్టీలో అంతర్గత కలహాలు, సిద్ధూతో తీవ్ర విభేదాలు కొనసాగుతున్న వేళ ఇటీవల కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆదేశాలతో ‘కెప్టెన్‌’ తన సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు సార్లు అవమానానికి గురయ్యానని, ఇకపై అలాంటివి భరించలేనంటూ రాజీనామా సందర్భంగా అమరీందర్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. ఆయన రాజీనామా చేసిన రెండు రోజుల తర్వాత దళిత నేత, సిద్ధూ శిబిరానికి చెందిన చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీని ముఖ్యమంత్రిగా నియమించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని