Rajya sabha: ఆ కేంద్రమంత్రి నన్ను సభలోనే బెదిరించారు!

 పెగాసస్‌ వ్యవహారం రాజ్యసభను మరోసారి కుదిపేసింది. 

Published : 23 Jul 2021 01:26 IST

దిల్లీ: పెగాసస్‌ వ్యవహారం రాజ్యసభను మరోసారి కుదిపేసింది. కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్ పూరి తనను సభలోనే బెదిరించారని, దుర్భాషలాడారంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ శాంతను సేన్‌ ఆరోపించారు. భౌతికంగా దాడి చేయడానికి ప్రయత్నిస్తే తన సహచరులు కాపాడారంటూ వ్యాఖ్యానించారు. రాజ్యసభ వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సభ వాయిదా పడిన తర్వాత హర్‌దీప్‌ సింగ్‌ పురి తనను చెడుగా సంబోధించారని, ఆయన వద్దకు వెళ్తుండగా బెదిరించారని సేన్‌ ఆరోపించారు. తనను ఘెరావ్‌ చేశారని, తన సహచరులు గుర్తించి రక్షించారని తెలిపారు. తన పట్ల అనాగరికంగా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. మరోవైపు, దీనిపై రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌కు తమ పార్టీ ఫిర్యాదు చేసిందని తెలిపారు. 

తొలుత, పెగాసస్‌ వ్యవహారంపై రాజ్యసభలో గురువారం హైడ్రామా నడిచింది. ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పెగాసస్‌పై ప్రకటన చేస్తుండగా కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఇతర విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. రాజ్యసభ కార్యకలాపాలకు అడ్డు తగిలారు. దీంతో పలుమార్లు సభ వాయిదా పడింది. విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేస్తుండగానే ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్న సమయంలో ఎంపీ శాంతను సేన్‌ మంత్రి చేతుల్లోని పేపర్లను లాక్కొని చింపేశారు. వాటిని గాల్లోకి విసిరేశారు. దీంతో ఆయన తన ప్రసంగం పూర్తికాకుండానే ఆపేయాల్సి వచ్చింది. ఈ పరిణామాలతో రాజ్యసభలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని