Ap News: కర్నూలు కలెక్టర్‌ నివాసం ముట్టడికి యత్నం.. భాజపా నేతల అరెస్టు

వైకాపా ప్రభుత్వం హిందూ ఆచారాలను, సంప్రదాయాలను ధ్వంసం చేయాలని చూస్తోందని భాజపా నాయకులు, స్వామిజీలు ఆరోపించారు. వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లల్లోనే..

Published : 06 Sep 2021 01:10 IST

కర్నూలు: వైకాపా ప్రభుత్వం హిందూ ఆచారాలను, సంప్రదాయాలను ధ్వంసం చేయాలని చూస్తోందని భాజపా నాయకులు, స్వామిజీలు ఆరోపించారు. వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లల్లోనే జరుపుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేడుకలకు ఇంకా సమయం ఉందన్న నేతలు ఈలోపు సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో వినాయక చవితి వేడుకలు, సామూహిక నిమజ్జనాలు జరుపుకోవద్దంటూ ప్రభుత్వం ఆదేశించడం దుర్మార్గమని భాజపా విమర్శించింది. కర్నూలులో నిర్వహించిన ఆ పార్టీ రాయలసీమ ముఖ్య నేతల సమావేశానికి జాతీయ అదనపు ప్రధాన కార్యదర్శి శివప్రకాష్‌, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతోపాటు ఇతర నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధ్వజమెత్తారు. పండుగకు ప్రభుత్వం అనుమతి ఇచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. 

అనంతరం భాజపా శ్రేణులు కర్నూలు నగరంలో ర్యాలీ నిర్వహించి, రాజ్‌ విహార్‌ కూడలిలో బైఠాయించి నిరసన తెలిపారు. కేవలం హిందువుల వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నారంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం భాజపా నేతలు, కార్యకర్తలతో కలిసి కర్నూలు కలెక్టర్‌ నివాసం ముట్టడికి వెళ్లారు. రహదారిపై వాహనాలను అడ్డకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, భాజపా నేతల మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. భాజపా నేత విష్ణువర్ధన్‌ రెడ్డి, ఇతర కార్యకర్తలను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని