Revanth: మోదీ ఏం మాయ చేశారో గానీ కేసీఆర్‌లో మార్పొచ్చింది: రేవంత్‌

ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ పాలనలో పేదల బతుకు దుర్భరంగా మారిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

Updated : 27 Sep 2021 14:25 IST

హైదరాబాద్‌: ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ పాలనలో పేదల బతుకు దుర్భరంగా మారిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రైతు ఉద్యమానికి కేసీఆర్‌ తొలుత మద్దాతిచ్చారని గుర్తు చేశారు. భారత్‌ బంద్‌లో భాగంగా ఉప్పల్‌ బస్‌ డిపో ఎదుట రేవంత్‌రెడ్డి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ‘‘గతంలో రైతు బంద్‌లో కేటీఆర్‌ కూడా పాల్గొన్నారు. మోదీని కలిసిన తర్వాత కేసీఆర్‌ వైఖరి మారిపోయింది. మోదీ ఏం మాయ చేశారో గాని కేసీఆర్‌లో మార్పు వచ్చింది. కేసీఆర్‌ బంద్‌లో పాల్గొనకుండా మోదీతో విందులో పాల్గొంటున్నారు. కేసీఆర్‌ ఎవరి పక్షాన ఉన్నారో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. తెలంగాణలో లక్షా 9వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వ కమిషన్లే చెప్పాయి.

రైతు శ్రేయస్సును గతంలో కాంగ్రెస్‌ కాపాడింది. మోదీ సర్కారు రైతులను బానిసగా మార్చింది. సాగు చట్టాలతో రైతు భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారింది. సాగు చట్టాలు రైతులు, వినియోగదారులకు మరణశాసనాలే. అదానీ, అంబానీలకు సాగును మోదీ తాకట్టు పెట్టారు. నల్ల చట్టాలతో వ్యవసాయ రంగాన్ని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం జరుగుతోంది. దేశవ్యాప్తంగా 33 కోట్ల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఆహార ధాన్యాల కృత్రిమ కొరత సృష్టించడానికే వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారు. అన్ని వస్తువులకు కంపెనీలే ధర చెబితే.. రైతు పండించిన పంటకు రైతు ధర నిర్ణయించలేకపోతున్నాడు’’ అని రేవంత్‌ అన్నారు. ఉప్పల్‌ బస్‌ డిపో ఎదుట ఆందోళనలో పాల్గొన్న రేవంత్‌తో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు ఉప్పల్‌ పీఎస్‌కు తరలించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని