TS News: ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికలో ఉత్కంఠ.. తెరాసకు పోటీగా స్వతంత్ర అభ్యర్థి 

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు ముగిసింది...

Updated : 27 Nov 2021 13:09 IST

ఆదిలాబాద్‌: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు ముగిసింది. ఈ సందర్భంగా ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు తెరాస తరఫున దండెం విఠల్‌ నామినేషన్‌ వేయగా, తుడుందెబ్బ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పుష్పరాణి నామినేషన్‌ వేశారు. వీరితో పాటు మరో 22 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు.

అయితే, నిన్న, ఇవాళ 20 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. సంపత్‌ కుమార్‌ అనే వ్యక్తి ఎన్నికల అధికారిని కలిసి పుష్పరాణి నామినేషన్‌ ఉపసంహరించుకున్నారని తెలిపారు. నామినేషన్ పత్రంలో ప్రతిపాదించిన పేర్లలో సంపత్‌ కుమార్‌ పేరు లేకపోవడంతో అధికారులు అభ్యంతరం తెలిపారు. ఉపసంహరణపై పుష్పరాణితో ఫోన్‌ చేయించాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే పుష్పరాణి తన నామినేషన్‌ ఉప సంహరించుకున్నారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని ఖండించిన పుష్పరాణి తాను బరిలో ఉన్నట్టు ప్రకటన విడుదల చేశారు. తనపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని వీడియో సందేశం పంపారు. మరోవైపు నామినేషన్ల గడువు ముగియడంతో కలెక్టర్‌ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. పుష్పరాణి నామినేషన్‌ ఉపసంహరణపై దాదాపు 2గంటల పాటు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, బాల్క సుమన్‌, కోనేరు కోనప్ప, బాపూరావు, జోగు రామన్న, రేఖానాయక్‌తో పాటు తెరాస రాష్ట్ర, జిల్లా నాయకులు ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ వద్దకు చేరుకున్నారు. కాసేపటికి పుష్పరాణి కూడా కలెక్టరేట్‌ వద్దకు చేరుకోవడంతో భాజపా శ్రేణులు పుష్పరాణికి మద్దతు తెలిపారు. పుష్పరాణిని అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు యత్నించడంతో తుడుందెబ్బ, భాజపా శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో భాజపా, తెరాస శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. చివరిరి పుష్పరాణి బరిలో నిలవడంతో ఆదిలాబాద్‌లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ అనివార్యమైంది. తెరాస తరఫున దండెం విఠల్‌, స్వతంత్ర అభ్యర్థిగా పెందూరి పుష్పరాణి బరిలో ఉన్నారు.

ఆదిలాబాద్‌ నుంచి నేనే ఒకరిని పోటీకి దించా: ఈటల

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో ఆదిలాబాద్‌ నుంచి తానే ఒకరిని పోటీకి దించానని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తెలిపారు. ‘‘ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వస్తాయి? గెలుస్తామా? ఓడుతామా? అనేది పక్కన పెడితే కనీసం పోటీ చేయాలి. అందుకే ఆదిలాబాద్‌ నుంచి ఒకరిని బరిలో దించా. తెరాసకు ఏకగ్రీవం అవకాశం ఇవ్వొద్దు. పోటీ చేస్తే   కేసీఆర్‌కు భయమైనా ఉంటుంది. కరీంనగర్‌లో ఒక స్థానంలో తెరాస ఓడిపోతుంది’’ అని ఈటల రాజేందర్‌ మీడియాతో అన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని