Subramanian Swamy: మమతపై పొగడ్త.. కేంద్రంపై తెగడ్త..!

ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందంటూ స్వయానా భాజపా నేత సుబ్రహ్మణ్య స్వామి విమర్శలు చేశారు.

Published : 25 Nov 2021 12:32 IST

మోదీ ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శించిన భాజపా నేత స్వామి

దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందంటూ భాజపా నేత సుబ్రహ్మణ్య స్వామి విమర్శలు చేశారు. ఆర్థిక వ్యవస్థ నుంచి అంతర్గత భద్రత వరకు ప్రతి విషయంలోనూ ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని ట్విటర్ వేదికగా ఎండగట్టారు. ఈ వ్యాఖ్యలు చేసింది కూడా.. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీని కలిసి, ఆమెను ప్రశంసించిన మరుసటి రోజే కావడం గమనార్హం. 

గురువారం ట్విటర్ వేదికగా స్పందించిన సుబ్రహ్మణ్య స్వామి.. మోదీ ప్రభుత్వపు ప్రోగ్రెస్ కార్డు గురించి వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ, సరిహద్దు భద్రతలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. అఫ్గానిస్థాన్‌ సంక్షోభాన్ని చక్కదిద్దడంలో విదేశాంగశాఖ వ్యవహరించిన తీరు సరిగా లేదని విమర్శించారు. పెగాసస్ స్పైవేర్‌తో జాతీయ భద్రత ప్రమాదంలో పడిందని నిందించారు. అలాగే ఈ ప్రభుత్వ హయాంలో జమ్మూకశ్మీర్‌ చీకటిలో మగ్గుతోందని మండిపడ్డారు. 

గత కొద్దికాలంగా మోదీ ప్రభుత్వ విధానాలపై ఆయన తరచూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. సరిహద్దులో చైనా దురాక్రమణ గురించి ప్రస్తావిస్తూ.. ‘చైనా మన అణ్వస్త్రాల గురించి భయపడనప్పుడు.. మనం ఎందుకు వారి ఆయుధాల గురించి ఆందోళన చెందాలి?’ అని ప్రశ్నించారు. అలాగే ధరల పెరుగుదలపై ఓ నెటిజన్ ట్వీట్ చేయగా... ఆయన(మోదీని ఉద్దేశించి)కు ఆర్థిక శాస్త్రం తెలీదంటూ వ్యాఖ్యానించారు.

మమత నిఖార్సైన నేత..

బుధవారం దిల్లీలో తృణమూల్ అధినేత్రితో స్వామి సమావేశమయ్యారు. అనంతరం ఈ భాజపా నేత నెట్టింట్లో స్పందించారు. ‘నేను కలిసిన, పని చేసిన అందరు రాజకీయ నేతల్లో మమతా బెనర్జీ నిఖార్సైన మనిషి. జయప్రకాశ్‌  నారాయణ్, మొరార్జీ దేశాయ్, రాజీవ్ గాంధీ, చంద్రశేఖర్, పీవీ నరసింహారావుల్లా తాను అనుకున్నదే చెప్పి, చెప్పిందే చేసే నాయకురాలు. భారత రాజకీయాల్లో అది అరుదైన లక్షణం’ అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని