Kishanreddy: కుటుంబ పార్టీలు దేశానికి, ప్రజా స్వామ్యానికి ప్రమాదకరం: కిషన్‌రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంతో లిఖిత పూర్వక ఒప్పందం మేరకే కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు...

Updated : 27 Nov 2021 19:34 IST

హైదరాబాద్‌: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంతో లిఖిత పూర్వక ఒప్పందం మేరకే కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ విషయాన్ని వదిలిపెట్టి కేసీఆర్‌ కుటుంబం.. కేంద్రంపై అనేక రకాల తప్పుడు ఆరోపణలు చేస్తుందని ధ్వజమెత్తారు. కుటుంబ పార్టీలు దేశానికి, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. రాష్ట్ర భాజపా కార్యవర్గ సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెరాస వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని భాజపా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. హుజూరాబాద్ ఎన్నిక సమయంలో ప్రగతిభవన్‌ పూర్తిగా తెరాస కార్యాలయంగా మారిపోయిందని మండిపడ్డారు. ఎంత అణచివేస్తే అంత తిరగబడ తామని అక్కడి ప్రజలు నిరూపించారని పేర్కొన్నారు. 

హుజూరాబాద్‌ తీర్పుపై ప్రజల దృష్టి మళ్లించడం కోసం వరి ధాన్యం కొనుగోలుపై తెరాస కొత్త పల్లవి ఎత్తుకుందని ఎద్దేవా చేశారు. లేని సమస్యలను సృష్టించి ఇందిరాపార్కు వద్ద కేసీఆర్‌ ధర్నా చేపట్టారని విమర్శించారు. పంటల బీమా పథకం తెలంగాణలో అమలు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని ఎందుకు తెరవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో శనగలు పంపిణీ చేయలేదు.. అవి ఎక్కడికిపోయాయో కేసీఆర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. దళితబంధు ఆపాలని భాజపా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిందని తప్పుడు ప్రచారం చేశారని, ఎన్నికలు ముగిశాయి ఇప్పుడెందుకు అమలు చేయడం లేదని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. అసలైన కవులు, కళాకారులు తెరాస పార్టీలో లేరని, వారిపై తెరాస ప్రభుత్వం నిర్బంధం విధిస్తుందన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని