Ts News: అదే జరిగితే కేసీఆర్‌ను ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారు: రేవంత్‌రెడ్డి

ప్రజలను మోసం చేయడంలో, పక్కదారి పట్టించడంలో భాజపా, తెరాస ఒకటేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి విమర్శించారు...

Updated : 09 Aug 2022 12:25 IST

హైదరాబాద్: ప్రజలను మోసం చేయడంలో, పక్కదారి పట్టించడంలో భాజపా, తెరాస ఒకటేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించిన మీడియా సమావేశంపై రేవంత్‌ స్పందించారు. సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ ఇద్దరూ కలిసి రైతులను మోసం చేస్తున్నారన్నారు. పంజాబ్‌ సహా 24 రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గిస్తే.. తెలంగాణలో ఎందుకు తగ్గించరని ప్రశ్నించారు. ప్రజలను దోచుకోవడంలో, అవినీతి సొమ్ము దాచుకోవడంలో కేసీఆర్, మోదీ ఇద్దరూఇద్దరే అని వ్యాఖ్యానించారు. వరి వేసేది లేదని కేంద్రానికి చెప్పి.. వరి వేస్తే ఉరి అని కేసీఆర్ తెలంగాణ రైతులకు మరణశాసనం రాశారన్నారు. కేసీఆర్ రాజకీయాలకు తెలంగాణ ప్రజలు ఉరి పెట్టె రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వెల్లడించారు. రాయచూరు ప్రజలు వారిని తెలంగాణలో కలపాలని అంటున్నారని.. అదే జరిగితే సీఎం కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు బంగాళాఖాతంలో కలుపుతారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ, భాజపాపైన యుద్ధం అంటూ మరోసారి సీఎం కేసీఆర్ నటిస్తున్నారని మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని