Ts News: వెంకట్రామిరెడ్డి రాజీనామాను ఆమోదించేందుకు వీల్లేదు: రేవంత్‌రెడ్డి

ఉమ్మడి మెదక్‌ కలెక్టర్‌గా వెంకట్రామిరెడ్డి భూఅక్రమాలకు సహకరించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. కోకాపేట భూముల వేలంలోనూ వెంకట్రామిరెడ్డి ...

Published : 17 Nov 2021 01:24 IST

హైదరాబాద్‌: ఉమ్మడి మెదక్‌ కలెక్టర్‌గా వెంకట్రామిరెడ్డి భూఅక్రమాలకు సహకరించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. కోకాపేట భూముల వేలంలోనూ వెంకట్రామిరెడ్డి కుటుంబానికి చెందిన రాజ్‌ పుష్ప సంస్థ భూములను దక్కించుకుందని ఆధారాలతో సహా వివరించారు. దుబ్బాక ఉపఎన్నిక సమయంలోనూ ఆయన తెరాసకు సహకరించారని వెల్లడించారు.

‘‘ఉమ్మడి రాష్ట్రంలోని సీఎంలకు అత్యంత ప్రీతిపాత్రుడైన వెంకట్రామిరెడ్డిని ఉమ్మడి మెదక్‌ జిల్లా కలెక్టర్‌గా సీఎం కేసీఆర్ నియమించారు. సీఎంలకు వేల కోట్ల రూపాయలు సంపాదించి పెట్టడం వంటి నైపుణ్యాలు వెంకట్రామిరెడ్డిలో ఉన్నాయి. దక్కన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ బాధ్యతలను కేసీఆర్‌ వెంకట్రామిరెడ్డికి అప్పగించారు. దక్కన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (డీఐఎల్‌) సీఈఓగా ఉన్న వెంకట్రామిరెడ్డి 5వేల ఎకరాలు ఎవరికి బదిలీ చేశారో సమాచారం అందుబాటులో లేదు. భూసేకరణ విషయంలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో రైతులను కొట్టించారు. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించారని వెంకట్రామిరెడ్డికి శిక్షతో పాటు జరిమానా విధించారు. వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి లేఖలు రాస్తే తుంగలో తొక్కారు. వెంకట్రామిరెడ్డిని ఆఘమేఘాల మీద ఎమ్మెల్సీ చేస్తున్నారు. ఏడేళ్లు వ్యాపారాలు చేసి వెనక్కి వచ్చిన సోమేశ్‌ కుమార్‌కు సీఎస్‌ పదవి ఇచ్చారు. అక్రమార్కులను అడ్డం పెట్టుకొని కేసీఆర్‌ అవినీతికి పాల్పడుతున్నారు. అవినీతి అధికారులకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తున్నారు. తన ఆస్తుల వివరాలను వెంకట్రామిరెడ్డి ఎక్కడా తెలుపలేదు. వెంకట్రామిరెడ్డి రాజీనామాను ఆమోదించేందుకు వీల్లేదు. ఆయన ఎమ్మెల్సీ నామినేషన్‌ తిరస్కరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’’ అని రేవంత్‌ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని