Revanth Reddy: కేసీఆర్‌ దిల్లీ పర్యటన.. తెరాస-భాజపా ఫిక్సింగ్‌ డ్రామా: రేవంత్‌

సీఎం కేసీఆర్‌ దిల్లీ పర్యటన తెరాస-భాజపా మ్యాచ్‌ ఫిక్సింగ్‌ డ్రామా అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు.  ఆ రెండు పార్టీల రాజకీయ చదరంగంలో రైతు పావుగా మారాడన్నారు..

Updated : 24 Nov 2021 14:11 IST

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ దిల్లీ పర్యటన తెరాస-భాజపా మ్యాచ్‌ ఫిక్సింగ్‌ డ్రామా అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు.  ఆ రెండు పార్టీల రాజకీయ చదరంగంలో రైతు పావుగా మారాడన్నారు. కల్లాల్లోని ధాన్యం కొనకుండా దిల్లీలో యాసంగి పంటపై డ్రామాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు ప్రజలకు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తడిచిన ధాన్యం కొనే అంశంపై కేసీఆర్‌ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కొనుగోలులో జరుగుతున్న ప్రభుత్వ నిర్లక్ష్యం, అలసత్వం వల్లే వర్షాలకు ధాన్యం తడిసి మోసులు వస్తున్నాయన్నారు. 

ఆ లేఖే రైతుల పాలిట ఉరితాడు..

యాసంగి ధాన్యం కొనే అంశంలో ఒత్తిడి చేయబోమంటూ కేంద్రానికి కేసీఆర్‌ ఇచ్చిన లేఖే నేడు వరి రైతుల పాలిట ఉరితాడు అయిందని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ‘కల్లాల్లోకి కాంగ్రెస్‌’ పర్యటనలో రైతులు తెలిపిన ఆవేదనపైనే మాట్లాడుతున్నానని చెప్పారు. భాజపా, తెరాస పార్టీలు తెలంగాణ రైతాంగ విశ్వాసాన్ని కోల్పోయాయన్నారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని.. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ నిధిని ఏర్పాటు చేయాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. చనిపోయిన రైతు కుటుంబాల పరిహారం కోసం న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ, రేపు మండల, జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్‌ ధర్నాలు.. నిరసన ప్రదర్శలు జరుగుతాయన్నారు. భవిష్యత్తులోనూ రైతుల పక్షాన కాంగ్రెస్‌ పార్టీ ఉద్ధృతంగా పోరాడుతుందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని