Ap News: చంద్రబాబు కంటతడి పెట్టడం బాధ కలిగించింది: పవన్‌ కల్యాణ్‌

రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు ఆవేదన కలిగిస్తున్నాయని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. శాసనసభలో జరిగిన పరిణామాలపై తెదేపా అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే. ఈరోజు సభలో ఏకంగా తన సతీమణి భువనేశ్వరిని...

Published : 20 Nov 2021 01:07 IST

అమరావతి: ఏపీ అసెంబ్లీలో ఇవాళ జరిగిన ఘటన రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. శాసనసభలో తెదేపా, వైకాపా నేతల మధ్య వాగ్వాదం సందర్భంలో.. తన సతీమణి భువనేశ్వరిని కించపరిచేలా వైకాపా నేతలు వ్యాఖ్యలు చేశారని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం ఎన్టీఆర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. అసెంబ్లీలో జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ వెక్కి.. వెక్కి ఏడ్చారు. ఈ పరిణామాలపై జనసేన అధినేత పనన్‌ కల్యాణ్‌ స్పందించారు. ‘‘రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు ఆవేదన కలిగిస్తున్నాయి. చంద్రబాబు తన భార్యను కించపరిచారని కంటతడి పెట్టారు. ఆయన కంటతడి పెట్టడం బాధ కలిగించింది. కుటుంబసభ్యులను కించపరచడం తగదు. రాష్ట్రంలో వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలను పట్టించుకోకుండా ఒకరినొకరు విమర్శించుకోవడం దురదృష్టకరం’’ అని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. 

భారీ వర్షాల ఎఫెక్ట్‌.. జనసేన బహిరంగ సభ వాయిదా

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఈ నెల 21న జనసేన తలపెట్టిన బహిరంగ సభ వాయిదా పడింది. ప్రకృతి విపత్తుతో రాయలసీమ అతలాకుతలమైందని, ప్రాణ నష్టం, పంట నష్టం సంభవించిన తరుణంలో బహిరంగ సభ నిర్వహించడం భావ్యం కాదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కోస్తా జిల్లాల్లోనూ రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని పవన్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నరసాపురం సభ ఎప్పుడు నిర్వహించేదీ త్వరలోనే తెలియజేయనున్నట్టు తెలిపారు.

అసభ్య వ్యాఖ్యలు చేయడం సరికాదు: సుజనా

తెదేపా అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యలపై అసభ్య వ్యాఖ్యలు చేయడం సరికాదని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. ఇలాంటి నేతలను సభానాయకుడే ప్రోత్సహించడం తగదన్నారు. రాజకీయాల్లో విధానాలపైనే విమర్శలు ఉండాలన్నారు. ఈ విధమైన అసభ్య పదజాలాన్ని మేధావులు, విద్యావంతులు ఖండించాలన్నారు. వ్యక్తిగతం లేనివారిని చట్టసభలకు పంపితే ఇలాగే ఉంటుందని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో విలువల రక్షణకు నేతలంతా ప్రయత్నించాలని సుజనా కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని