Amarinder Singh: కొత్త పార్టీ పెడుతున్నా.. త్వరలో ఆ వివరాలు చెప్తా..!

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. పంజాబ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి పదవిని వీడిన అమరీందర్ సింగ్.. త్వరలో కొత్త పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. దీనిపై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 

Updated : 27 Oct 2021 14:05 IST

చండీగఢ్‌: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. పంజాబ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి పదవిని వీడిన అమరీందర్ సింగ్.. త్వరలో కొత్త పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. దీనిపై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘పంజాబ్‌లో త్వరలో నేను పార్టీ పెట్టబోతున్నాను. కొద్ది రోజుల తర్వాత ఆ వివరాలు వెల్లడిస్తాను. ఇప్పటికే మాతో చాలా మంది నేతలున్నారు. పార్టీ ప్రకటించిన తర్వాత వారు ఎవరో వెల్లడవుతుంది. మా పార్టీ మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది. అలాగే భాజపాతో పొత్తు పెట్టుకుంటానని నేను ఎన్నడూ చెప్పలేదు. నా పార్టీ, నేను సీట్ల పంపకం గురించి ఆలోచిస్తామని చెప్పాను’ అని అమరీందర్ వెల్లడించారు. ఇటీవల ఆయన సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌) అధికార పరిధిని పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన మాట్లాడుతూ.. తాను మొదట సైనికుడిగా శిక్షణ పొందానని, తాను అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర భద్రత, నిఘా విషయంలో చురుగ్గా చర్యలు తీసుకున్నానని వెల్లడించారు. ‘బలగాలు మన భద్రత కోసమే పనిచేస్తాయి. వారు ప్రభుత్వానికి ఏ హాని తలపెట్టరు. వారి పని వారిని చేయనివ్వండి’ అని ఆయన అన్నారు. రాష్ట్రం కల్లోలభరితంగా ఉండాలని తాను కోరుకోవడం లేదన్నారు. అలాగే డ్రోన్ల కార్యకలాపాలపై హెచ్చరికలు చేశారు. ‘అవి చైనీస్ డ్రోన్లు. వాటి సామర్థ్యం రోజురోజుకు పెరిగిపోతోంది. అవి చండీగఢ్‌ను చేరేరోజు ఎంతో దూరంలో లేకపోవచ్చు’ అని ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి అంతా బాగానే ఉందని కాంగ్రెస్ అనడం.. ఆ పార్టీ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు. సాగు చట్టాలపై కేంద్రంతో చర్చిస్తున్నానని, ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తానని చెప్పారు.   

అధికారం కోసం పట్టు, విమర్శలు, రాజీనామాలతో పంజాబ్‌ కాంగ్రెస్‌ చిక్కుల్లో పడింది. ఈ క్రమంలోనే కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన భాజపాలో చేరతారని, కొత్త పార్టీ పెడతారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవ్‌జోత్ సింగ్ సిద్ధూ పోటీ చేసేచోటే బరిలో దిగుతామని వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని