UP Elections: యోగి ఆదిత్యనాథ్‌పై పోటీకి మాజీ పోలీసు..!

ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు ఇప్పటి నుంచే రసవత్తరంగా మారుతున్నాయి. ఆ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే సన్నాహాలు

Updated : 15 Aug 2021 05:08 IST

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు ఇప్పటి నుంచే రసవత్తరంగా మారుతున్నాయి. ఆ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టాయి. కాగా.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై మాజీ పోలీసు అధికారి ఒకరు పోటీకి దిగుతుండటం ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాది బలవంతపు పదవీ విరమణ చేసిన ఐపీఎస్‌ అధికారి అమితాబ్ ఠాకూర్‌ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎంపై పోటీ చేయనున్నట్లు ఆయన కుటుంబసభ్యులు వెల్లడించారు. 

‘‘సీఎంగా ఆదిత్యనాథ్‌ ఎన్నో అప్రజాస్వామిక చర్యలు చేపట్టారు. వివక్షపూరిత నిర్ణయాలు తీసుకున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసినా ఆయనపై అమితాబ్‌ ఠాకూర్‌ బరిలోకి దిగుతారు. ఇది అమితాబ్‌ సిద్ధాంతాల కోసం చేస్తోన్న పోరాటం’’ అని ఆయన భార్య నూతన్‌ తెలిపారు. 

అమితాబ్‌ ఠాకూర్‌ యూపీ కేడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. 2015లో సమాజ్‌వాదీ పార్టీ అగ్రనేత ములాయం సింగ్‌ యాదవ్‌పై చేసిన వ్యాఖ్యలకు గానూ ఆయనను విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. అనంతరం ఆయనపై దర్యాప్తు కూడా చేపట్టారు. అయితే 2016 ఏప్రిల్‌లో సెంట్రల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ట్రైబ్యూనల్‌ లఖ్‌నవూ బెంచ్‌ ఆయన సస్పెన్షన్‌ను నిలిపివేస్తూ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని పోలీస్‌ శాఖను ఆదేశించింది. ఆ తర్వాత తన కేడర్‌ను మార్చాలంటూ 2017లో అమితాబ్‌ కేంద్రాన్ని కోరారు. 

ఇదిలా ఉండగా.. ప్రజాప్రయోజనాల దృష్ట్యా అమితాబ్‌ తప్పనిసరి రిటైర్మెంట్‌ తీసుకోవాలని ఈ ఏడాది మార్చిలో కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2028 వరకు ఆయనకు సర్వీసు ఉన్నప్పటికీ.. మిగిలిన పదవీకాలంలో కొనసాగేందుకు ఆయన ఆరోగ్యపరంగా ఫిట్‌గా లేరని పేర్కొంటూ ఆయన వెంటనే పదవీ విరమణ చేయాలని ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని