TS News: ఉద్యమంలో మరణించిన రైతులకు పరిహారం ఇవ్వాలి: రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్‌ పార్టీ రైతులకు అండగా పోరాటం చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఎన్ని రకాలుగా హింసలు పెట్టినా ఉద్యమంలో రైతులు

Updated : 20 Nov 2021 21:34 IST

హైదరాబాద్‌: రైతులకు కాంగ్రెస్‌ పార్టీ అండగా పోరాటం చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రధాని మోదీ ఎన్ని రకాలుగా హింసలు పెట్టినా ఉద్యమంలో రైతులు వెనక్కు తగ్గలేదని కొనియాడారు. ఉద్యమంలో 700 మందికి పైగా రైతులు అమరులయ్యారని, మరణించిన రైతులకు నివాళులర్పిస్తూ, విజయం సాధించిన రైతులకు అభినందనలు తెలపడానికే కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక కార్యక్రమం చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా నెక్లెస్‌ రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు కొవ్వొత్తుల  ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టారు. రైతుల హక్కులను అదాని, అంబానీలకు తాకట్టు పెట్టడానికి మోదీ చేసిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా రైతులు పోరాటం చేశారని కొనియాడారు. మోదీ చట్టాలు తెచ్చినప్పుడు అసెంబ్లీలో వ్యతిరేకంగా తీర్మానం చేయాలంటే కేసీఆర్‌ చేయలేదని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌ ఏ ఒక్కరోజూ రైతు ఉద్యమానికి మద్దతు పలకలేదని, రైతులను పరామర్శించలేదని విమర్శించారు. పోరాటంలో మరణించిన రైతులకు కేంద్ర ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

రైతులు, కాంగ్రెస్‌ పోరాటం చేయడం వల్లనే వ్యవసాయ నల్లచట్టాలు రద్దయ్యాయని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు అన్నారు. రైతులను చంపిన మంత్రి కుమారుడిపై కఠిన చర్యలతో పాటు, ఆ మంత్రిని బర్తరఫ్  చేయాలని కాంగ్రెస్‌ నేత మధుయాష్కీ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో పండించిన ప్రతి గింజ కొనడంతో పాటు, అధిక వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్ ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోకపోతే కాంగ్రెస్‌ ఉద్యమం చేస్తుందని మరోనేత చిన్నారెడ్డి హెచ్చరించారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే సీతక్క, గీతారెడ్డి, అనిల్ యాదవ్, సునీతా రావ్, బల్మూరి వెంకట్, నూతి శ్రీకాంత్ తదితరులు ఈ కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని