Published : 21/11/2021 01:16 IST

KCR: రైతులపై పెట్టిన కేసులన్నీ కేంద్రం ఎత్తివేయాలి: కేసీఆర్‌

హైదరాబాద్‌: ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రానికి ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా ఉలుకూపలుకు లేదని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. శనివారం రాత్రి ప్రగతి భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడాదిలో ఎంత ధాన్యం కొనుగోలు చేస్తారో స్పష్టంచేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతాం.. మాట్లాడతామని కేంద్రం చెప్పిందన్నారు. సీఎస్‌తో కలిసి అంతా దిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, ఎఫ్‌సీఐని కలవాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. బాయిల్డ్‌ రైస్‌ కొనేది లేదని కేంద్రం చెప్పినట్టు వార్తలొచ్చాయని.. కానీ అది ఎంతవరకు నిజమో తెలియదన్నారు. మూడు సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఉత్తరాదిలో రైతులు అద్భుత విజయం సాధించారని కేసీఆర్‌ ప్రశంసించారు. రైతు ఉద్యమాల సందర్భంగా పెట్టిన వేలాది కేసులన్నీ ఎత్తివేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. రైతులకు మద్దతు తెలిపిన వారిపై దేశం ద్రోహం కేసులు కూడా పెట్టారన్నారు. అమాయకులపై పెట్టిన కేసులన్నీ రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు.

అమరులైన రైతుల కుటుంబాలకు ₹3లక్షలు చొప్పున ఇస్తాం..

‘‘రైతుల విషయంలో కేంద్రం దుర్మార్గంగా వ్యవహరించింది. కేంద్ర ప్రభుత్వం తప్పొప్పులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కేంద్రం తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలు ముమ్మాటికీ తప్పు. ప్రధాని మోదీ తప్పు తెలుసుకుని  రద్దు చేసి క్షమాపణ కోరారు. సాగు చట్టాల కోసం ఉద్యమించి అమరులైన అన్నదాతల కుటుంబాలను కేంద్రమే ఆదుకోవాలి. ఉద్యమ సమయంలో సుమారు 700 నుంచి 750మంది వరకు రైతులు ప్రాణాలు కోల్పోయారు. ప్రతి రైతు కుటుంబానికీ కేంద్రం రూ.25లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. ఉద్యమంలో అమరులైన రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుఫున నివాళులర్పిస్తున్నాం. అలాగే, ఒక్కో కుటుంబానికి రూ.3లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించాం. ఇందుకు ₹22.5కోట్లు ఖర్చవుతుంది. అమరులైన రైతుల వివరాలను ఇవ్వాలని రైతు సంఘటన్‌ నేతల్ని అడిగాం. ఆ నేతలను సంప్రదించి అమరులైన రైతుల కుటుంబాలను మా మంత్రులు, అవసరమైతే నేను వెళ్లి స్వయంగా కలిసి ఎక్స్‌గ్రేషియో వారికి అందిస్తాం. రైతుల పోరాటం ఎంతో స్ఫూర్తిమంతమైనది. పంటలకు కనీస మద్దతు ధర చట్టం తేవాలి. కనీస మద్దతు ధర చట్టాన్ని వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టాలి’’ అని కేసీఆర్‌ కోరారు.

కావాలంటే.. మీ నిర్ణయాన్ని అక్కడ అమలు చేసుకోండి

‘‘తెలంగాణలో వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్‌  ఇస్తున్నాం. విద్యుత్‌ చట్టం తెచ్చి వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి చేస్తోంది. దీనిపై  రైతులు చాలా ఆందోళనతో ఉన్నారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో మీ నిర్ణయాన్ని అమలు చేసుకోండి  కానీ, అన్ని రాష్ట్రాల్లో మీటర్లు పెట్టాలని ఆదేశించడం సమంజసం కాదు. పార్లమెంట్‌లో విద్యుత్‌ చట్టం బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాలి. బిల్లు పాస్‌ కాకుండా లోక్‌సభ, రాజ్యసభలో పోరాడతాం’’ అన్నారు.

మా సహనాన్ని పరీక్షించొద్దు.. మా నీటి వాటా ఎంతో తేల్చండి!

‘‘రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లయినా...  కేంద్రం ఇంకా నీటి వాటాలు తేల్చలేదు. తెలంగాణ నీటి వాటా ఎంతో స్పష్టం చేయాలి. ఈ విషయంలో కేంద్రం చేస్తున్న తాత్సారం తెలంగాణ అభివృద్ధికి ప్రతిబంధకంగా మారింది. దీనిపై దిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని, కేంద్ర జలశక్తిశాఖ మంత్రిని కలిసి నీటి వాటా తేల్చాలని కోరతాం. కృష్ణా, గోదావరిలో నీటి వాటాలను తేల్చేందుకు వెంటనే  ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేసి నిర్దేశిత సమయంలో తేల్చాలి. కోర్టులో కేసు కూడా ఉపసంహరించుకున్నాం. లేనిపక్షంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. మా సహనాన్ని పరీక్షించొద్దు.. తెలంగాణ ఉద్యమాల గడ్డ. నీటి వాటా తేల్చాల్సిన బాధ్యత కేంద్రానిది. కానీ, ఆ బాధ్యతను  విస్మరించింది. దయచేసి వెంటనే తేల్చాలి’’ అని కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు.

వానా కాలం పంటలో ప్రతిగింజా కొనుగోలు చేస్తాం

‘‘బీసీ కులగణన చేపట్టాలని బీసీలు అడుగుతున్నారు.  అది న్యాయమైన డిమాండ్‌. కుల గణన చేయమని కేంద్రం ఎందుకు చెప్పాలి.  ఏ కులంలో ఎంత మంది ప్రజలు ఉన్నారో  తేల్చలేని పరిస్థితి దేశంలో ఎందుకొచ్చింది. రాబోయే జనగణనలో కులగణన చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నాం. ఎస్సీల రిజర్వేషన్‌ పెంపును కూడా తేల్చకుండా తొక్కిపెట్టారు. ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేసి పంపితే దానిపైనా కేంద్రం నుంచి స్పందన లేదు.  రైతుల అనురాధ కార్తి నిన్న వచ్చేసింది.. ఇంకా తాత్సారం చేయొద్దు. ఏడాదిలో తెలంగాణ ధాన్యం ఎంత తీసుకుంటారో స్పష్టం చేయాలి. స్థానిక భాజపా నాయకులు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా .. మీరు చేసిన తప్పును ఒప్పుకొని తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాలి. ఇంకా అడ్డగోలుగా మాట్లాడతామంటే కుదరదు. వానాకాలం పంటలో చివరి గింజ వరకూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. 6600 కేంద్రాలు ప్రారంభించాం. ఎవరూ ఆందోళన చెందవద్దు. భాజపా నాయకులు చేసే చిల్లర ప్రచారాన్ని రైతులు నమ్మొద్దు. యాసంగికి రైతుబంధు కూడా సకాలంలో ఇస్తాం. రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకోవాలి.యాసంగి పంటల గురించి దిల్లీ వెళ్లి వచ్చాక చెప్తాం’’ అని కేసీఆర్‌ తెలిపారు.


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని