Updated : 25/11/2021 15:43 IST

Chandrababu: ప్రకృతి వైపరీత్యాలు చెప్పిరావు..: చంద్రబాబు

రేణిగుంట: వరదల విషయంలో వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారిందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు చెప్పిరావని.. సమర్థతతో పనిచేయాలని చెప్పారు.  సమర్థంగా వ్యవహిరించి ఉంటే ప్రాణనష్టం తగ్గేదన్నారు.  చిత్తూరు జిల్లా రేణిగుంటలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.  వర్షాలు ఈ ఏడాది ఎక్కువగా పడతాయని.. రాయలసీమలోనూ వర్షాలు కురుస్తాయని ముందుగానే వార్తలు వచ్చాయన్నారు. దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిందని.. కానీ ప్రభుత్వ అనుభవ రాహిత్యం, అహంభావం ప్రజలకు శాపమైందని ఆక్షేపించారు. ఊరుకు ఊరే తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలాంటి సమయాల్లో సమర్థమైన ప్రభుత్వం ఉంటే ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయగలిగితే ప్రాణ, ఆస్తినష్టాలు తగ్గుతాయని చెప్పారు.

యంత్రాంగం కుప్పకూలింది..

‘‘పింఛ, అన్నమయ్య ప్రాజెక్టుల్లోకి నీరు వచ్చే సమయంలోనూ అప్రమత్తం చేయలేకపోయారు. ఇలాంటి విపత్తులు వచ్చినపుడు బలవంతంగానైనా ప్రజలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. విపత్తు నిర్వహణ శాఖ చేయాల్సిన ప్రాథమిక బాధ్యత ఇది.  కానీ అలాంటిదేమీ చేయకుండా ప్రజలకే వదిలేశారు. పింఛ, అన్నమయ్య ప్రాజెక్టుల్లో నాశిరకమైన పనులు చేశారు. అన్నమయ్య ప్రాజెక్టు నిర్వహణకు నిధులు ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు గేట్లు తెరుచుకోలేదనే వార్తలు కూడా వచ్చాయి.  వరదపై తమకు ఎలాంటి హెచ్చరికలు చేయలేదని అక్కడి ప్రజలు చెప్పారు.  ముందుగా నీరు విడుదల చేసి ఉంటే పింఛ, అన్నమయ్య ప్రాజెక్టు,  కల్యాణి డ్యామ్‌లలో వరద తీవ్రత  ఉండేది కాదు.  నీటి విడుదలలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. సరిగా ఆపరేట్‌ చేయలేకపోయారు.  రాయలచెరువు పరిస్థితిపై సీనియర్‌ అధికారులు ముందుకొచ్చి భరోసా ఇవ్వలేకపోయారు. అసలు ప్రభుత్వం ఎక్కడుంది? యంత్రాంగం మొత్తం కుప్పకూలిపోయింది.

వైకాపా నేతలది పైశాచిక ఆనందం

రాయలచెరువులో ఎప్పుడూ ఇంత నీరు రాలేదు. దాన్ని మేనేజ్‌ చేయడంలో విఫలమయ్యారు. పెద్ద పంపులతో ఆ చెరువులో నీళ్లు తోడొచ్చు.. అదీ చేయలేకపోయారు. దీంతో మొత్తం అతలాకుతలం అయిపోయింది.  ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం అసెంబ్లీలో ఆనందపడుతూ పొగిడించుకుంటున్నారు. ఇక్కడ ప్రజల ఆర్తనాదాలు.. అక్కడ పొగడ్తలు. వరద బాధితులు కుటుంబసభ్యులను కోల్పోవడంతో పాటు తిండి, నీళ్లు లేక ఇబ్బంది పడుతుంటే వైకాపా నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారు.  
కొండ పక్కనే కెనాల్‌ తవ్వించాలి

కపిలతీర్థం నుంచి కొండ పక్కనే కెనాల్‌ తవ్వాలి. ఎంత వరదొచ్చినా తిరుపతి నగరంలోకి నీరు రాకుండా నేరుగా స్వర్ణముఖి నదిలోకి వెళ్లేలా చర్యలు చేపట్టాలి. తక్షణమే రాయల చెరువు తూముల మరమ్మతు చేపట్టాలి. ఎంతనీరు వచ్చినా స్వర్ణముఖిలోకి వెళ్లేలా చేయాలి. ఇసుక మాఫియాను నియంత్రించాలి. స్వర్ణముఖిపై ఉన్న బ్రిడ్జిలన్నీ కొట్టుకెళ్లాయి.. వాటిని పునరుద్ధరించాలి. మృతుల కుటుంబాలు, పంట నష్టపోయిన రైతులకు పరిహారం పెంచాలి. తెదేపా అధికారంలోకి వస్తే వరద బాధిత మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు ఇస్తాం.

న్యాయవిచారణకు ఆదేశించాలి

వరదలు మానవ తప్పిదమే. దీనిపై ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించాలి. ఎందుకు సరైన సమయంలో నీరు విడుదల చేయలేదు? ప్రాజెక్టులు ఎందుకు సరిగా నిర్వహించలేకపోయారు? ప్రకృతితో ఆడుకున్నారు.. తుమ్మలగుంట చెరువును క్రికెట్ స్టేడియంగా మార్చేశారు. దీంతో నీరు జనావాసాల్లోకి వచ్చేసింది. దీనికి బాధ్యులెవరు? వారిపై చర్యలు తీసుకోవాలి. అధికారం ఉందని ఇష్టారీతిన వ్యవహరిస్తే అధికారం ఇచ్చిన వాళ్లే పాతాళానికి నెడతారు. ప్రజలకు సహాయక చర్యలు చేపట్టడంలోనూ ప్రభుత్వం విఫలమైంది. ఎక్కడా క్యాంపులు కూడా నిర్వహించలేదు. పునరావాసంలోనూ విఫలమయ్యారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా సుమారు 40వేల మందికి సాయమందించాం’’ అని చంద్రబాబు చెప్పారు.


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని