Ap News: దిల్లీలో అఖిలపక్ష సమావేశం.. ఏపీ ఎంపీలు ఏమన్నారంటే..?

కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని అఖిలపక్ష సమావేశంలో కోరామని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు...

Published : 28 Nov 2021 17:10 IST

దిల్లీ: కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని అఖిలపక్ష సమావేశంలో కోరామని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. దిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు పాల్గొన్నారు. భేటీ అనంతరం విజయసాయి మీడియాతో మాట్లాడారు. ఏపీలో 24 పంటలకు మద్దతు ధర ఇస్తున్నామని.. దేశ వ్యాప్తంగా అన్ని పంటలకూ మద్దతుధర ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. కనీస మద్దతు ధరపై జేపీసీ వేయాలని కోరామన్నారు. ఆహార భద్రత చట్టంలో ఏపీకి జరిగిన అన్యాయం సరిదిద్దాలని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. బీసీల గుర్తింపునకు సామాజిక, ఆర్థిక కుల గణన చేపట్టాలని, మహిళా రిజర్వేషన్‌, దిశ బిల్లులను ఆమోదించాలని కోరామన్నారు. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్‌ బకాయిలను వెంటనే చెల్లించాలని.. లేదంటే కేంద్రమే భరించాలని అఖిలపక్ష భేటీలో స్పష్టంగా చెప్పినట్లు వెల్లడించారు.

అనంతరం తెదేపా ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్‌, గల్లా జయదేవ్‌ మీడియాతో మాట్లాడారు. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌పై అఖిలపక్ష సమావేశంలో చర్చించామని తెదేపా ఎంపీలు తెలిపారు. ఏపీలో పెట్రో ధరలు తగ్గించలేదని భేటీలో చెప్పినట్లు పేర్కొన్నారు. ఏకీకృత నిబంధన తీసుకొచ్చి దేశమంతా ఒకే ధర ఉండేలా చూడాలని కోరినట్లు చెప్పారు. విశాఖ ఉక్కు, ఇతర ప్రైవేటీకరణ వద్దని కోరామన్నారు. అమరావతిని రాజధానిగా ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేసినట్లు తెదేపా ఎంపీలు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని