Updated : 28/08/2021 15:27 IST

Bandi Sanjay: ప్రజా సంగ్రామ యాత్రతో రాజకీయ మార్పు: బండి సంజయ్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో విశ్వాసం, ఆత్మస్థైర్యం కల్పించేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. రాష్ట్రంలో రాజకీయ మార్పునకు ఈ యాత్ర వేదిక కానుందని చెప్పారు. పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని సందర్శించిన అనంతరం ప్రజా సంగ్రామ యాత్ర పేరిట చేపట్టిన పాదయాత్రను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చార్మినార్‌ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బండి సంజయ్‌ మాట్లాడారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, డీకే అరుణ, లక్ష్మణ్‌, విజయశాంతి తదితరులు ఈ సభలో పాల్గొన్నారు. 

‘‘తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1400 మంది బలిదానాలు చేశారు. అమరుల ఆకాంక్షలకు, ఆశయాలకు భిన్నంగా రాష్ట్రంలో ఒక్క కుటుంబమే పాలన సాగిస్తోంది. సీఎం కేసీఆర్‌ హయాంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు. మాటలతో మభ్యపెడుతూ కేసీఆర్‌ పబ్బం గడుపుతున్నారు. రైతులందరికీ ఉచిత యూరియా ఇస్తానని చెప్పి రైతులను మోసం చేశారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ నిరుద్యోగ యువకులను మోసగించారు. ఏడెనిమిది ఏళ్లు దాటినా ఇంత వరకు వాటి గురించి పట్టించుకోలేదు. ఒక్కో నిరుద్యోగికి లక్ష చొప్పున కేసీఆర్‌ ప్రభుత్వం బాకీ ఉంది. దళితులకు మూడెకరాల భూమి, దళితుడిని సీఎం చేస్తానన్న హామీని సీఎం కేసీఆర్‌ అటకెక్కించారు. ‘దళిత బంధు’ పేరుతో దళితులను.. గొర్రెలు, బర్రెలంటూ బీసీలను వంచిస్తున్నారు’’ అని బండి సంజయ్‌ అన్నారు. ఎస్టీలకు 12 శాతం రిజిస్ట్రేషన్లు ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణను ఆత్మహత్యల తెలంగాణంగా మార్చారని దుయ్యబట్టారు. పాతబస్తీలో ఉన్న ఎంఐఎం ఆగడాలను తట్టుకుని హిందువులు జీవిస్తున్నారని, పాతబస్తీని ఇదివరకే వదిలి వెళ్లిన హిందువులంతా తిరిగి రావాలని సంజయ్‌ పిలుపునిచ్చారు.

కుటంబ పాలనకు తెరదించాలి: కిషన్‌ రెడ్డి
‘‘తెలంగాణలో నిజాంలాంటి పాలన అంతం కావాలి. అక్రమాలు, అవినీతి, అప్పుల పాలన పోవాలి. కుటుంబ పాలనకు తెరదించి ఒక ప్రజాస్వామ్య పాలనకు ప్రజలు స్వాగతం పలకాలి. తెరాస ప్రభుత్వాన్ని గద్దె దించే ఉద్యమం ఈ ప్రజా సంగ్రామ యాత్ర. కల్వకుంట్ల కుటుంబం అబద్ధాలపై పాలన సాగిస్తోంది. అవినీతి పాలనపోయి.. నీతివంతమైన పాలన రావాలంటే కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి. తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క టీచర్‌ పోస్టు కూడా భర్తీ చేయలేదు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతోంది’’ అని కిషన్‌ రెడ్డి అన్నారు.  

తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్‌ పాలన నుంచి విముక్తి కలిగించాలని భాజపా రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు తరుణ్‌ చుగ్‌ అన్నారు. రాష్ట్రాన్ని ఆలీబాబా 40 దొంగల్లా పాలిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలనకు అంతం కోసమే ఈ యాత్ర నిర్వహిస్తున్నామని, రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావడం ఖాయమని డీకే అరుణ అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ యాత్రతో పెనుమార్పులు సంభవించబోతున్నాయని లక్ష్మణ్‌ అన్నారు. రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానే అని అన్నారు. తెరాస, కాంగ్రెస్‌ రెండూ ఒకటేనని చెప్పారు.


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని