సవరించిన అంచనాలపై అధ్యయనం అవసరం

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం వేగం

Updated : 08 Feb 2021 15:05 IST

కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌

దిల్లీ: పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఏపీ ప్రభుత్వం వేగం పెంచాల్సి ఉందని కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ అన్నారు. కొన్ని విషయాల్లో శ్రద్ధ వహించాల్సి ఉందని చెప్పారు. ఆర్‌అండ్‌ఆర్‌ సమస్యపై దృష్టి పెడితే పనులు వేగంగా జరుగుతాయని సూచించారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం రాజ్యసభలో పోలవరం ప్రాజెక్టు విషయాన్ని ప్రస్తావించారు. సవరించిన అంచనాలను ఎప్పుడు ఆమోదిస్తారో చెప్పాలని కేంద్ర జలశక్తిమంత్రిని అడిగారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.2500 కోట్లు సొంత నిధులను ఖర్చు చేసిందని వివరించారు. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.47వేల 725కోట్ల వ్యయం అవుతుందని రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ అంచనా వేసినట్లు మార్చి 2020లో లోక్‌సభలో మంత్రి ప్రకటించారని ఎంపీ అన్నారు. కానీ సాంకేతిక నిపుణుల కమిటీ 2017- 18 ధరల ప్రకారం రూ.55 వేల 656 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసిందని తెలిపారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి గజేంద్ర షేకావత్‌ 2013- 14 ధరల ప్రకారం ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు. ధరలు పెంచేందుకు అవకాశం లేదని విభజన చట్టంలో పేర్కొన్నట్లు తెలిపారు. 

పెరిగిన ధరలపై నిపుణుల కమిటీ ఇచ్చిన సవరించిన అంచనాలను ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి రివాల్వింగ్‌ ఫండ్‌ ఏర్పాటు చేయాలని విజయసాయిరెడ్డి కోరారు. ఇలా చేస్తే నిధుల సమస్య ఉండదని అనుకున్న సమయానికి ప్రాజెక్టు నిర్మించే అవకాశం ఉంటుందన్నారు. దీనిపైనా స్పందించిన షెకావత్‌ పొలవరం నిర్మాణానికి ఎటువంటి నిధులు సమస్య లేదని వివరించారు. నాబార్డ్‌ నిధులను అందజేస్తామన్నారు. పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బిల్లులను సమర్పించాలన్నారు. వాటి పరిశీలన తర్వాత నిధులు విడుదల చేస్తామని కేంద్ర మంత్రి వెల్లడించారు.  ప్రాజెక్టులో సవరించిన అంచనాలు అధ్యయనం చేయాల్సి ఉందని వివరించారు. అంచనాల అధ్యయనం తర్వాత కేబినేట్‌కు పంపుతామన్నారు. కేబినేట్‌ నిర్ణయం మేరకు ముందుకెళ్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. 


ఇవీ చదవండి..
బ్యాంకుల ప్రైవేటీకరణకు ఆర్‌బీఐతో పనిచేస్తాం

న్యూయార్క్‌ అసెంబ్లీలో ‘కశ్మీర్‌’ తీర్మానం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని