Sidhu: సొంత నియోజకవర్గంలోనే సిద్ధూకి నిరసన సెగ!

పంజాబ్‌ కాంగ్రెస్‌లో అంతర్గత వివాదం కొనసాగుతున్న వేళ ఆ పార్టీ రాష్ట్ర చీఫ్‌ నవజ్యోత్‌ సిద్ధూకు తన సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. .....

Published : 31 Aug 2021 01:42 IST

అమృత్‌సర్‌: పంజాబ్‌ కాంగ్రెస్‌లో అంతర్గత వివాదం కొనసాగుతున్న వేళ ఆ పార్టీ రాష్ట్ర చీఫ్‌ నవజ్యోత్‌ సిద్ధూకు తన సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. అమృత్‌సర్‌ (తూర్పు) నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు సోమవారం ఆయన వెళ్లగా కొందరు దుకాణదారులు నిరసన వ్యక్తంచేశారు. సిద్ధూ అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. సిద్ధూకి సన్నిహితుడిగా ఉన్న అక్కడి కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ తమను బెదిరిస్తున్నాడని, దుకాణాలు ఖాళీ చేయాలంటూ ఒత్తిడి చేయడంపై జోక్యం చేసుకోవాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో నిరసనకు దిగారు. దుకాణదారులు సిద్ధూకి వ్యతిరేకంగా నినాదాలు చేసినట్టు కొందరు స్థానిక నేతలు పేర్కొన్నారు. 100 అడుగుల రహదారిపై ఉన్న దేవాలయం ప్రధాన ద్వారం ఆధునీకరణ పనులను ప్రారంభించిన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేసినట్టు తెలిపారు. 

పంజాబ్‌లో వచ్చే ఎడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ సీఎం అమరీందర్‌ సింగ్‌, సిద్ధూ మధ్య ఆధిపత్య పోరు తీవ్రస్థాయిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. పలు అంశాలపై ఒకరినొకరు లక్ష్యంగా చేసుకొంటూ వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్‌కు ఇదో పెద్ద తలనొప్పి వ్యవహారంలా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని