ED Raids: నన్ను ఇరికించేందుకు కేంద్రం కుట్రలు: సీఎం చన్నీ ఆరోపణలు

పంజాబ్‌లోని పలుచోట్ల ఈడీ దాడుల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ కేంద్రంపై మండిపడ్డారు. కేసుల్లో తనను ఇరికించేందుకు.......

Published : 20 Jan 2022 02:08 IST

చండీగఢ్‌: పంజాబ్‌లోని పలుచోట్ల ఈడీ దాడుల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ కేంద్రంపై మండిపడ్డారు. కేసుల్లో తనను ఇరికించేందుకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఎన్నికలు వస్తే భాజపా ప్రభుత్వం ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థల్ని రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని వాడుకుంటోందనీ.. తద్వారా వారిని తమవైపు లాక్కొనేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారంలో తన మేనల్లుడు భూపిందర్‌సింగ్‌ అలియాస్‌ హనీ ఇంట్లో ఈడీ సోదాలపై చన్నీ స్పందించారు. ఈ కేసులో తనను ఇరికించేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందన్నారు. పలువురు మంత్రులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

మరోవైపు, ఇసుక అక్రమ తవ్వకాల కేసుకు సంబంధించి మనీలాండరింగ్‌ వ్యవహారంలో పలుచోట్ల సోదాలు జరిపి దాదాపు రూ.10కోట్ల మేర స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి. వీటిలో దాదాపు రూ.8కోట్ల మేర చన్నీ మేనల్లుడు భూపిందర్‌సింగ్ అలియాస్‌ హనీకి సంబంధించినవేనని తెలిపారు. మిగతా రూ.2కోట్లు మాత్రం సందీప్‌ కుమార్‌ అనే వ్యక్తి వద్ద సీజ్‌ చేసినట్టు తెలిపారు. అయితే, ఈ కేసుకు సంబంధించి 2018లో నవాన్‌షహర్‌లో దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లో తన మేనల్లుడి పేరు లేదన్నారు. తన మేనల్లుడు దోషిగా తేలితే చర్యలు తీసుకోవచ్చనీ.. కానీ, చిల్లర రాజకీయాలకు పాల్పడవద్దని సూచించారు. కాంగ్రెస్‌ నేతల్ని తమవైపు లాక్కొనేందుకు భాజపా జిమ్మిక్కులు చేస్తోందనీ.. తాను, తన కుటుంబం ఇలాంటి ఎత్తుగడలకు లొంగబోమని చన్నీ అన్నారు. ఫిరోజ్‌పూర్‌లో  ఇటీవల మోదీ సందర్శన నేపథ్యంలో చోటుచేసుకున్న ఘటనకు ఇది ప్రతీకారంగా కనబడుతోందని వ్యాఖ్యానించారు. ఈ కేసులో తనను ఇరికించేందుకు తన మేనల్లుడిని 24గంటల పాటు విచారించారనీ.. తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారం లభించలేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని