Rahul Gandhi: ‘రివర్స్‌ గేర్‌లో మోదీ బండి.. పైగా బ్రేకులూ ఫెయిలయ్యాయి’

దేశవ్యాప్తంగా వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే వాణిజ్యావసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరనూ ఒక్కోదానిపై దాదాపు రూ.268 చొప్పున పెంచారు. మరోవైపు సామాన్యులు ఈ...

Published : 06 Nov 2021 14:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే వాణిజ్యావసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరనూ ఒక్కోదానిపై దాదాపు రూ.268 చొప్పున పెంచారు. మరోవైపు సామాన్యులు ఈ ధరలతో గగ్గోలు పెడుతున్నారు! ప్రతిపక్షాలూ మండిపడుతున్నాయి. తాజాగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సైతం వంట గ్యాస్‌ ధరల భారం విషయంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రస్తుత చర్యలన్నీ అభివృద్ధి మాటలకు దూరంగా ఉన్నాయని పేర్కొన్నారు. సిలిండర్ల ధరలు భరించలేక.. లక్షలాది కుటుంబాలు మళ్లీ కట్టెల పొయ్యి వెలిగించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి వాహనం రివర్స్ గేర్‌లో ప్రయాణిస్తోంది.. పైగా దాని బ్రేకులు కూడా ఫెయిలయ్యాయని ఎద్దేవా చేశారు. వంట గ్యాస్‌ ధరల కారణంగా చాలామంది మళ్లీ కట్టెల పొయ్యి వైపు మళ్లుతున్నారంటూ వచ్చిన కథనాన్ని ఉటంకిస్తూ.. రాహుల్‌ గాంధీ శనివారం ఈ మేరకు ట్వీట్‌ చేశారు.

ఇదిలా ఉండగా.. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో లీటరు పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున తగ్గింది. ఆయా రాష్ట్రాలూ వ్యాట్‌ తగ్గింపునకు ముందుకు రావడంతో.. వినియోగదారులకు కాస్త ఉపశమనం లభించినట్లయింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని