ఆరోపణలు తీవ్రమైనవే..శరద్‌ పవార్‌

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ చేసిన ఆరోపణలు తీవ్రమైనవేనని ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ పేర్కొన్నారు.

Updated : 12 Mar 2024 16:54 IST

లోతైన దర్యాప్తు అవసరమన్న ఎన్‌సీపీ అధినేత

ముంబయి: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ చేసిన ఆరోపణలు తీవ్రమైనవేనని ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలపై లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. హోంమంత్రిపై వచ్చిన ఆరోపణల దర్యాప్తు, చర్యల విషయంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నిర్ణయం తీసుకుంటారని శరద్‌ పవార్‌ వెల్లడించారు. మహారాష్ట్ర హోంమంత్రిగా ఉన్న ఎన్‌సీపీ నేతపై ఆరోపణలు రావడంపై శరద్‌ పవార్‌ దిల్లీలో మాట్లాడారు.

‘పరమ్‌‌బీర్‌ సింగ్‌ రాసిన లేఖపై ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రేతో చర్చించాను. దీనిపై దర్యాప్తు చేసేందుకు మాజీ ఐపీఎస్‌ అధికారి జులియో రిబెయిరో సహాయం తీసుకోవాలని ఉద్ధవ్‌ ఠాక్రేకు సూచించాను’ అని ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌‌ పవార్‌ వెల్లడించారు. ముంబయి పోలీసు కమిషనర్‌ పదవి నుంచి హోంగార్డుల విభాగానికి మార్చి 17న బదిలీ చేసిన తర్వాతే పరమ్‌బీర్‌ ఈ ఆరోపణలు చేసినట్లు శరద్‌ పవార్‌ గుర్తుచేశారు. అయితే, మాజీ పోలీస్‌ కమిషనర్‌ చేసిన ఆరోపణలు తమ ప్రభుత్వంపై ఎటువంటి ప్రభావం చూపించదని ఆయన అన్నారు. కేవలం మహా వికాస్‌ అగాఢీ ప్రభుతాన్ని అస్థిరపరచేందుకే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని, కానీ, చివరకు అవి వృథానే అవుతాయని పేర్కొన్నారు.

ముంబయి నగరంలోని బార్లు, హుక్కా సెంటర్ల నుంచి నెలకు రూ.100కోట్లు వసూలు చేయాలని పోలీసు అధికారులకు హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ నిర్దేశించారని ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్‌ ముఖ్యమంత్రికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తాజాగా పరమ్‌బీర్‌ కూడా అంగీకరించారు. దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. తాజా పరిణామాలపై ‘మహా వికాస్‌ అగాఢీ’ కూటమి భేటీ అయి చర్చించే అవకాశం కనిపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని