మా పార్టీ పేదల కోసం.. అల్లుళ్ల కోసం కాదు!

నరేంద్రమోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న విమర్శలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. తాము కొందరిలా ‘అల్లుళ్ల’ కోసం పనిచేయడం లేదంటూ పరోక్షంగా...

Updated : 13 Feb 2021 05:52 IST

కాంగ్రెస్‌ పార్టీపై నిర్మలా సీతారామన్‌ విమర్శలు

దిల్లీ: నరేంద్రమోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న విమర్శలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. తాము కొందరిలా ‘అల్లుళ్ల’ కోసం పనిచేయడం లేదంటూ పరోక్షంగా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను తోసిపుచ్చుతూ పేదల కోసం తమ ప్రభుత్వం పనిచేస్తోందంటూ వారి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఈమేరకు బడ్జెట్‌పై చర్చ సందర్భంగా రాజ్యసభలో నిర్మలా సీతారామన్‌ మాట్లాడారు.

పేదల కోసం ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ విపక్షాలు పదే పదే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని నిర్మలా సీతారామన్‌ విమర్శించారు. ఆశ్రిత పెట్టుబడిదారుల కోసం పనిచేస్తున్నామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా నేపథ్యంలో 80 కోట్ల మందికి ఉచితంగా ఆహారధాన్యాలు సరఫరా చేశామని, 8 కోట్ల మందికి ఉచితంగా వంట గ్యాస్‌ అందించామని, మరో 4 కోట్ల మందికి రైతులు, మహిళలు, దివ్యాంగులకు నగదు బదిలీ చేశామని నిర్మలా సీతారామన్‌ వివరించారు. వీరంతా ధనికులా అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద సుమారు 1.67 కోట్ల ఇళ్లు పూర్తయ్యాయని, 2.67 కోట్ల ఇళ్లకు పీఎం సౌభాగ్య యోజన కింద విద్యుత్‌ అందించామన్నారు. వీరంతా బడా కార్పొరేటర్లా? అని ఆమె ప్రశ్నించారు.

2016 ఆగస్టు నుంచి 2020 జనవరి వరకు 3.6 లక్షల కోట్ల డిజిటల్‌ లావాదేవీలు యూపీఐ ద్వారా జరిగాయని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ‘‘యూపీఐని వాడిన వారంతా ధనికులా?’’ అని ప్రశ్నించారు. యూపీఐని ప్రభుత్వం తీసుకొచ్చింది మధ్య తరగతి, చిరు వ్యాపారుల కోసమే తప్ప.. పెట్టుబడిదారులు, ‘అల్లుళ్ల’ కోసమైతే కాదు అంటూ దెప్పిపొడిచారు. అయితే, ఆమె అల్లుళ్లు అనే పదం ఉచ్చరించడాన్ని కాంగ్రెస్‌ నేతలు తప్పుబట్టారు. దీనిపై ఆమె వెంటనే అందుకుని కాంగ్రెస్‌ పార్టీకి అదేమైనా ట్రేడ్‌మార్కా అంటూ దుయ్యబట్టారు. ఉపాధి హామీ పథకంలోని లోపాలన్నింటినీ తొలగించామని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.90,500 కోట్లు వెచ్చించామని, బడ్జెట్‌ అంచనాలకు మించి ఖర్చు చేశామని వివరించారు. కాంగ్రెస్‌ హయాంలో ఏనాడూ బడ్జెట్‌ అంచనాలను అందుకోలేదని విమర్శించారు.

ఇవీ చదవండి..
ఆ చట్టాలతో గ్రామీణ ఆర్థికానికి దెబ్బ: రాహుల్‌
రెచ్చగొట్టే పార్టీలకు బుద్ది చెప్పాలి: కేటీఆర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని