Suvendu Adhikari: ఆ ప్రతీకారం వల్లేరిపబ్లిక్‌ డే పరేడ్‌కు నన్ను పిలవలేదు..!

గణతంత్ర వేడుకల్లో భాగంగా నిర్వహించిన పరేడ్‌కు సీఎం మమతా బెనర్జీ తనను ఆహ్వానించలేదని బెంగాల్‌ ప్రతిపక్ష నేత, భాజపా నేత సువేందు .......

Published : 27 Jan 2022 01:20 IST

కోల్‌కతా: గణతంత్ర వేడుకల్లో భాగంగా నిర్వహించిన పరేడ్‌కు సీఎం మమతా బెనర్జీ తనను ఆహ్వానించలేదని బెంగాల్‌ ప్రతిపక్ష నేత, భాజపా నేత సువేందు అధికారి అన్నారు. నందిగ్రామ్‌లో తన చేతిలో పరాజయాన్ని మమత ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తనచేతిలో ఓటమికి ప్రతీకారంగానే ఈరోజు రెడ్‌ రోడ్‌ పరేడ్‌ ఆహ్వానితుల జాబితా నుంచి తన పేరును తప్పించారని ఆరోపించారు. క్యాన్సర్‌కు కూడా మందు ఉందన్న సువేందు అధికారి.. ప్రతీకారేచ్ఛ స్వభావం, అసూయలకు మాత్రం ఉండదన్నారు. ప్రతిపక్ష నేతను పరేడ్‌కు ఆహ్వానించకపోవడం ప్రొటోకాల్‌ నిబంధనలకు విరుద్ధమని ఆమె మరిచిపోయి ఉంటారని వ్యాఖ్యానించారు. గతేడాది ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత అబ్దుల్‌ మాన్‌ను ఆహ్వానించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. మరోవైపు, రెడ్‌ రోడ్‌లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్‌ జగదీప్‌ ధన్కర్‌, కేబినెట్‌ మంత్రులు పాల్గొన్నారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఈ వేడుకలను నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని