ఆ నిధుల్ని ఏం చేశారో ప్రజలు నిలదీయాలి: షా

పుదుచ్చేరిలో రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర హోంమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం కరైకల్‌లో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు.

Updated : 28 Feb 2021 14:58 IST

చెన్నై: పుదుచ్చేరిలో రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర హోంమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం కరైకల్‌లో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. పుదుచ్చేరి అసెంబ్లీకి ఏప్రిల్‌ 6న ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే.

‘పుదుచ్చేరిలో 75శాతం నిరుద్యోగ యువత ఉంది. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువత 40శాతానికి తగ్గుతుంది. కొద్ది రోజుల కిందట ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కేంద్రంలో మత్స్య శాఖ ఎందుకు లేదని ప్రశ్నించారు. కనీసం కేంద్రంలో ఆ శాఖ రెండేళ్ల కిందటి నుంచే ఉందని కూడా తెలియని వ్యక్తి మీకు నాయకుడిగా కావాలా? అని నేను అడగదలచుకున్నా. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలంతా భాజపాలో చేరుతున్నారు. అక్కడ పురోగతి లేదు కాబట్టే వారు భాజపాలో చేరుతున్నారు’ అని కేంద్ర హోంమంత్రి విమర్శించారు.

‘ప్రధాని మోదీకి తమిళ సోదరులు అన్నా, తమిళ భాష అన్నా ఎంతో ఇష్టం. అందుకే ఆయన ఈ రోజు మన్‌కీబాత్‌లోనూ తమిళం నేర్చుకోలేనందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ప్రధానిగా తమిళం నేర్చుకుని ఇక్కడి సోదరులతో ఆయన మాట్లాడాలనుకుంటున్నట్లు చెప్పారు. మత్స్యకారుల సమస్యలు తీర్చి మౌలిక సౌకర్యాలు మెరుగు పరచడానికి కేంద్రం బడ్జెట్‌లో 20వేల కోట్లు కేటాయించింది. ఈ ప్రాంతం అభివృద్ధికి కేంద్రం రూ.15వేల కోట్లు మంజూరు చేసింది. కానీ, నారాయణ స్వామి ప్రభుత్వం ఆ నిధుల్ని ఎక్కడ ఖర్చు చేసిందనే విషయాన్ని ప్రజలు నిలదీయాలి’ అని షా ప్రజలకు చేశారు.

‘మేం అధికారంలోకి వస్తే ఇక్కడ ఉన్న ప్రతి పేద కుటుంబానికి స్వచ్ఛమైన తాగునీటి కుళాయి సౌకర్యాన్ని కల్పిస్తాం. పుదుచ్చేరి అభివృద్ధికి మోదీ ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. పర్యాటకాన్ని ప్రోత్సహించే విధంగా ఉడాన్‌ పథకంలో భాగంగా పుదుచ్చేరి, బెంగళూరు, హైదరాబాద్‌ను అనుసంధానం చేసింది. ప్రజాస్వామ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవి. కానీ, భాజపా ఎదుగుతుందనే ఉద్దేశంతో.. ఇక్కడి నాయకులు ఏళ్ల తరబడి స్థానిక ఎన్నికలు జరగకుండా చేశారు ’ అని కాంగ్రెస్‌పై షా తీవ్ర విమర్శలు చేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని