యూపీలో అప్నాదళ్‌, నిషద్‌ పార్టీతో భాజపా పొత్తు.. మళ్లీ 300+ ఖాయం: నడ్డా

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అప్నాదళ్‌, నిషద్‌ పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నట్లు భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.

Published : 20 Jan 2022 02:12 IST

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అప్నాదళ్‌, నిషద్‌ పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నట్లు భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. వెనుకబడిన సామాజిక వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ రెండు పార్టీలతో కలిసి ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు. రెండు పార్టీల నేతలతో సమావేశం అనంతరం నడ్డా బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. సీట్ల పంపకంపై మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు.

రాబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్‌ డెమొక్రటిక్‌ అలయెన్స్‌ (ఎన్డీయే)గా మూడు పార్టీలు బరిలోకి దిగుతున్నట్లు నడ్డా వెల్లడించారు. మొత్తం 403 సీట్లలోనూ కూటమిగా పోటీ చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఐదేళ్ల యోగి పాలనపై నడ్డా ప్రశంసలు గుప్పించారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు రాష్ట్రాభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. యూపీలో ఎన్డీయే కూటమి మరోసారి 300కు పైగా సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా ఎన్డీయే విజయం ఖాయమంటూ ట్వీట్‌ చేశారు. భేటీలో పాల్గొన్న నేతల ఫొటోలను ట్విటర్‌లో ఉంచారు.

అప్నాదళ్‌ అధినేత్రి అనుప్రియా పటేల్‌, నిషద్‌ పార్టీ అధ్యక్షుడు సంజయ్‌ నిషద్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఓబీసీల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తోందని, మిగిలిన పార్టీలు ఓబీసీలను విస్మరించాయని దుయ్యబట్టారు. ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదాగా కల్పించిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. పొత్తులో భాగంగా 2017 ఎన్నికల్లో అప్నాదళ్‌కు 11 సీట్లు కేటాయించగా.. 9 సీట్లలో గెలుపొందింది. నిషద్‌ పార్టీ ఒంటరిగా 72 స్థానాల్లో పోటీ చేయగా.. కేవలం ఒక్క స్థానంలోనే గెలుపొందింది. మొత్తం ఏడు విడతల్లో యూపీలో ఎన్నికలు జరగనుండగా... మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు