ఓట్లకే కాదు టీకా కోసమూ ఇంటింటికీ తిరగండి!

కరోనా థర్డ్‌ వేవ్‌పై భయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకొనేలా చూడాలని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు స్థానిక ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు......

Updated : 24 Sep 2022 17:16 IST

ప్రజాప్రతినిధులకు మంత్రి  హరీశ్‌రావు పిలుపు

హైదరాబాద్‌: కరోనా థర్డ్‌ వేవ్‌పై భయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకొనేలా చూడాలని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు స్థానిక ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. సదాశివపేటలో మాట్లాడిన వీడియోను ఆయన ట్విటర్‌లో పంచుకున్నారు. ‘‘దండం పెట్టి చెబుతున్నాం. మా వార్డు సభ్యులారా? ఓట్లప్పుడు ఇల్లిల్లూ తిరిగారు మీరు. ఇప్పుడు టీకాల కోసం కూడా ఇల్లిల్లూ తిరగండి. ఇప్పుడు 18 ఏళ్లు దాటిన వారికి కూడా టీకాలు వేయిస్తున్నాం. టీకాలకు ఇప్పుడు ఇబ్బంది లేదు. దయచేసి ఇంటింటికీ వెళ్లండి.. ఆ ఇంట్లో ఒక్కరు మిగిలినా పట్టుకొచ్చి వ్యాక్సిన్‌ ఇప్పించండి. ఓట్లప్పుడు పట్టుకొచ్చినట్టే ఇప్పుడు టీకాలకు కూడా పట్టుకురండి’’ అని సూచించారు.

ఎన్నికల సమయంలో మోటార్‌ సైకిల్‌, ఆటో పెట్టి ఓటు కోసం తీసుకొచ్చేవాళ్లమని.. అలాగే ఇప్పుడు టీకా వేయించేందుకు కూడా చేయాలన్నారు. వార్డులో ఒక్క మనిషి కూడా టీకా వేయించుకోని వాళ్లు ఉండొద్దన్నారు. పట్టుబట్టి , దొరకబట్టి టీకా వేయించే పని చేయాలని సూచించారు. కరోనా మళ్లీ వస్తుందని అంటున్నారని, అందుకే ముందుగానే వ్యాక్సిన్‌ వేయించుకుంటే మంచిదని తెలిపారు. ఈ వైరస్‌ నుంచి మాస్క్‌లు‌, టీకాలే కాపాడతాయన్నారు. మాస్క్‌ లేకుండా బయటకు రావొద్దు.. టీకా రాకుండా ఎవరూ మిగలొద్దు అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆగస్టులో థర్డ్‌ వేవ్‌ వస్తుందని కొందరు, దసరాకు వస్తుందని ఇంకొందరు చెబుతున్నారన్నారు. అందువల్ల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఇప్పటికే ఈ మహమ్మారి రెండుసార్లు వచ్చిందని, మళ్లీ వస్తే పరేషాన్‌ అవుతామన్నారు. రాకముందే అందరూ టీకా వేయించుకోవాలని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని