Goa polls: భాజపాకు మనోహర్‌ పారికర్‌ తనయుడు గుడ్‌బై.. స్వతంత్రంగా బరిలోకి

గోవా మాజీ సీఎం దివంగత మనోహర్‌ పారికర్‌ తనయుడు ఉత్పల్‌ పారికర్‌ భాజపాకు గుడ్‌ బై చెప్పారు. పనాజీ నుంచి స్వతంత్రంగానే పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.......

Published : 22 Jan 2022 01:38 IST

పనాజీ: గోవా మాజీ సీఎం దివంగత మనోహర్‌ పారికర్‌ తనయుడు ఉత్పల్‌ పారికర్‌ భాజపాకు గుడ్‌బై చెప్పారు. పనాజీ నుంచి స్వతంత్రంగానే పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. తన తండ్రి నేతృత్వం వహించిన పనాజీ స్థానం నుంచి ఎన్నికల్లో నిలబడాలని భావించిన ఉత్పల్‌కు భాజపా టికెట్‌ కేటాయించకపోవడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

‘పార్టీ సభ్యుల మద్దతుతోపాటు, పనాజీ ప్రజల ఆదరాభిమానాలు నాకు లభిస్తున్నాయి. అయినా నా పార్టీ (భాజపా) నాకు పనాజీ నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వలేదు. రెండేళ్ల క్రితం పార్టీలో చేరిన మరో వ్యక్తికి టికెట్‌ ఇచ్చారు. ఈ విషయంలో అధిష్ఠానాన్ని ఒప్పించేందుకు చివరివరకు ప్రయత్నించా. అయినా ఫలితం లేకపోయింది. అందుకే ఒంటరిగా పోరాడేందుకు సిద్ధమయ్యా. ఇకపై పనాజీ ప్రజలే నా రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తారు’ అని విలేకర్ల సమావేశంలో ఉత్పల్‌ వ్యాఖ్యానించారు.

గత పాతికేళ్లుగా మనోహర్‌ పారికర్‌ గెలుస్తూ రికార్టు సృష్టించిన పనాజీ స్థానాన్ని.. ఎమ్మెల్యే అటానాసియో బాబుష్‌ మాన్‌సెరేట్‌కు భాజపా కేటాయించింది. అయితే, తన తండ్రిని ఆదరించిన సీటు నుంచే పోటీ చేసేందుకు ఆసక్తి కనబర్చిన ఉత్పల్‌.. చివరి వరకు టికెట్‌ కోసం ప్రయత్నించారు. తమ పార్టీ టికెట్‌పైనే మరో స్థానం నుంచి పోటీ చేసేలా ఆయనకు నచ్చజెప్పేందుకు కమలనాథులు ప్రయత్నించినా అది ఫలించలేదు. మరోవైపు గోవాలో అధికారంలోకి వచ్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ ఉత్పల్‌ను తమ పార్టీలోకి ఆహ్వానించింది. దిల్లీ సీఎం, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ తమ పార్టీలోకి రమ్మంటూ ట్వీట్‌ చేశారు. కానీ ఇతర పార్టీల్లో చేరేందుకు సిద్ధంగా లేని ఉత్పల్‌.. స్వతంత్రంగానే పోరులోకి దిగనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని