Mamata: మోదీతో దీదీ భేటీ.. ఆ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌!

తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం దిల్లీకి వచ్చిన......

Updated : 06 Dec 2021 19:18 IST

దిల్లీ: తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం దిల్లీకి వచ్చిన ఆమె బుధవారం ప్రధానితో సమావేశమయ్యారు. తమ రాష్ట్రంలో సరిహద్దు భద్రత దళం (బీఎస్‌ఎఫ్‌) పరిధిని పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. అలాగే, వచ్చే ఏడాది బెంగాల్‌లో జరగబోయే గ్లోబల్‌ బిజినెస్‌ మీట్‌ ప్రారంభోత్సవానికి రావాలని ప్రధానికి ఆహ్వానం పలికారు. దేశ ఫెడరల్‌ వ్యవస్థకు ఎట్టిపరిస్థితుల్లో ఆటంకం కలిగించరాదని కోరినట్టు సమాచారం. బీఎస్‌ఎఫ్‌ పరిధి పెంపుతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై మోదీతో దీదీ చర్చించినట్టు సమాచారం. బెంగాల్‌ సహా సరిహద్దు రాష్ట్రాల్లో అంతర్జాతీయ సరిహద్దు నుంచి 50 కి.మీ. వరకు బీఎస్‌ఎఫ్‌ అధికార పరిధిని పెంచుతూ కేంద్ర హోంశాఖ ఇటీవల ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. కేంద్రం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో బెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌,  భాజపా మధ్య మరోసారి రాజకీయ చిచ్చు రాజుకుంది.

అఖిలేశ్‌కు సహకరించేందుకు మేం సిద్ధమే!
ప్రధానితో భేటీ అనంతరం దీదీ మీడియాతో మాట్లాడారు. ప్రధానిని గ్లోబల్‌ బిజినెస్‌ సమ్మిట్‌కు ఆహ్వానించినట్టు వెల్లడించారు. త్రిపురలో తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలపై భాజపా శ్రేణులు జరుపుతున్న దాడులు, వేధింపుల అంశాన్ని కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. రాబోయే యూపీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ గనక తమ సహాయం కోరితే.. అందుకు తాము సిద్ధమేనని ప్రకటించారు. ప్రధాని మినహా తాను ఎవరితోనూ అపాయింట్‌మెంట్‌ కోరలేదని మమత స్పష్టంచేశారు. నవంబర్‌ 30 -డిసెంబర్‌ 1 తేదీల్లో ముంబయి పర్యటనకు వెళ్లినప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌లతో భేటీ కానున్నట్టు వెల్లడించారు.

Read latest Political News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని