Goa polls: మనోహర్‌ పారికర్‌ తనయుడికిభాజపాలో నిరాశ.. కేజ్రీవాల్‌ ఆఫర్‌!

గోవా మాజీ సీఎం దివంగత మనోహర్‌ పారికర్‌ తనయుడు ఉత్పల్‌ పారికర్‌కు భాజపాలో నిరాశ ఎదురైంది. మరికొద్ది వారాల్లో జరగబోయే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పనాజీ స్థానం......

Published : 21 Jan 2022 01:35 IST

పనాజీ: గోవా మాజీ సీఎం దివంగత మనోహర్‌ పారికర్‌ తనయుడు ఉత్పల్‌ పారికర్‌కు భాజపాలో నిరాశ ఎదురైంది. మరికొద్ది వారాల్లో జరగబోయే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పనాజీ స్థానం నుంచి పోటీ చేయాలని భావించిన ఉత్పల్‌కు పార్టీ టికెట్‌ నిరాకరించింది. పాతికేళ్లుగా పారికర్‌ గెలుస్తూ రికార్టు సృష్టించిన పనాజీ స్థానాన్ని ఎమ్మెల్యే అటానాసియో బాబుష్‌ మాన్‌సెరేట్‌కు కేటాయించింది. ఈ మేరకు 34మంది అభ్యర్థుల జాబితాను భాజపా గోవా వ్యవహారాల ఇన్‌ఛార్జి దేవేంద్ర ఫడణవీస్‌ గురువారం విడుదల చేశారు. అయితే, తన తండ్రిని ఆదరించిన సీటు నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న ఉత్పల్‌ను అడ్డుకోవాలని భాజపా ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయన అక్కడి నుంచే పోటీచేయాలనే గట్టి పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. అంతేకాకుండా తన వైఖరిని త్వరలోనే తెలియజేస్తానని కూడా ఉత్పల్‌ ప్రకటించడంతో గోవా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఉత్పల్‌ను తమ పార్టీ టికెట్‌పైనే మరో స్థానం నుంచి పోటీ చేసేలా ఆయనకు నచ్చజెప్పేందుకు కమలనాథులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా కుటుంబ సభ్యులతో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. 

ఉత్పల్‌కు కేజ్రీవాల్‌ ఆహ్వానం..

మరోవైపు, గోవాలో అధికారంలోకి వచ్చేందుకు గట్టిగా శ్రమిస్తున్న ఆప్‌ అక్కడి పరిణామాలపై చురుగ్గా స్పందించింది. ఉత్పల్‌ పారికర్‌కు పనాజీ టికెట్‌ ఇచ్చేందుకు భాజపా నిరాకరించడంతో ఆప్‌ రంగంలోకి దిగింది. ఉత్పల్‌ను తమ పార్టీలోకి ఆహ్వానిస్తూ దిల్లీ సీఎం, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. పారికర్‌ కుటుంబం పట్ల భాజపా అవలంబించిన తీరు గోవా ప్రజల్ని ఆవేదనకు గురిచేస్తోందని పేర్కొన్నారు. మనోహర్‌ పారికర్‌ అంటే తనకు ఎల్లప్పుడూ ఎంతో గౌరవమని తెలిపారు. ఉత్పల్‌ తమ పార్టీలో చేరి ఆప్‌ టికెట్‌పై పోటీ చేసేందుకు సాదరంగా స్వాగతిస్తున్నట్టు తెలిపారు. 

గోవాలో భాజపాకు అంతా తానై నడిపించిన మనోహర్‌ పారికర్‌ సుదీర్ఘ రాజకీయ అనుభవం, నిబద్ధత కలిగిన నేతగా ప్రజల్లో మంచి ఇమేజ్‌ ఉన్న విషయం తెలిసిందే. గోవాకు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పనాజీ స్థానం నుంచి దాదాపు పాతికేళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన మనోహర్‌ పారికర్‌ 2019లో కన్నుమూశారు. అయితే, అప్పట్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున అటానాసియో బాబుష్‌ మాన్‌సెరేట్‌ కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచారు. ఆ తర్వాత ఆయన భాజపాలోకి ఫిరాయించారు. తాజాగా అటానాసియోకే పనాజీ టికెట్‌ను భాజపా కేటాయించడం గమనార్హం. మొత్తం 40 స్థానాలు కలిగిన గోవా అసెంబ్లీకి ఫిబ్రవరి 14న ఒకే దశలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని