మేనల్లుడిని సీఎం చేయడమే దీదీ లక్ష్యం: షా

బెంగాల్‌లో డెంగీ, మలేరియా వ్యాధులతో దీదీ స్నేహం చేస్తున్నారని అందుకే అవి రాష్ట్రాన్ని వదిలిపెట్టడం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విమర్శించారు. రాష్ట్రంలో ఆ వ్యాధులు నిర్మూలన కావాలంటే భాజపాకు ఓటెయ్యాలని ఆయన తెలిపారు.

Published : 25 Mar 2021 15:42 IST

కోల్‌కతా: బెంగాల్‌లో డెంగీ, మలేరియా వ్యాధులతో దీదీ స్నేహం చేస్తున్నారని అందుకే అవి రాష్ట్రాన్ని వదిలిపెట్టడం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విమర్శించారు. రాష్ట్రంలో ఆ వ్యాధులు నిర్మూలన కావాలంటే భాజపాకు ఓటెయ్యాలని ఆయన తెలిపారు. ఈ మేరకు గురువారం  బాఘ్‌ముండిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో షా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన దీదీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.  

‘రాష్ట్ర ప్రజలకు దీదీ ఫ్లోరైడ్‌ నీటిని సరఫరా చేస్తున్నారు. మీరు ఒక్కసారి దీదీని ఇక్కడి నుంచి పంపిస్తే.. మీకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు భాజపా ప్రభుత్వం రూ.10వేల కోట్లు కేటాయిస్తుంది. గతంలో టీఎంసీ, లెఫ్ట్‌ ప్రభుత్వాలు రాష్ట్రానికి పరిశ్రమల్ని రాకుండా చేశారు. అందుకే ఉపాధి అవకాశాలు లభించలేదు. మీకు ఉద్యోగాలు కావాలంటే తప్పకుండా భాజపాకు ఓటెయ్యండి. మోదీ ప్రజల సంక్షేమం కోసం ఎన్నికలు కావాలనుకుంటారు. కానీ దీదీ తన మేనల్లుడిని సీఎం చేయడం కోసం ఎన్నికలు కావాలనుకుంటున్నారు’ అని షా తెలిపారు.  

‘ప్రధాని మోదీ దేశ అభివృద్ధి కోసం 115 స్కీంలు ప్రవేశపెట్టారు. కానీ బెంగాల్‌లో దీదీ 115 స్కాంలు తెచ్చారు. భాజపా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని రైతులందరి ఖాతాల్లో పెట్టుబడి కింద రూ.18వేలు అందిస్తాం. ఆదివాసీల అభివృద్ధి కోసం మేం కట్టుబడి ఉన్నాం. ఇప్పటికే కేంద్రం ఇక్కడ రైల్వే సదుపాయాల కల్పనకు పనులు ప్రారంభించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరికీ ప్రభుత్వ బస్సుల్లో రవాణా ఉచితంగా కల్పిస్తాం. దీదీ మలేరియా, డెంగీతో స్నేహం చేస్తోంది. వాటిని నిర్మూలన చేయాలంటే భాజపా అధికారంలోకి రావాలి’ అని ఓటర్లకు అమిత్‌షా విజ్ఞప్తి చేశారు. 

పశ్చిమబెంగాల్‌లోని 294 అసెంబ్లీ స్థానాలకు మార్చి 27 నుంచి ఏప్రిల్‌ 6వతేదీ వరకు ఎనిమిది దశల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. మే 2వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని