ఎంత పనున్నా పిల్లలతో హోమ్‌వర్క్‌ చేయిస్తా.. ఒక్కోసారి ఉదయం నాలుగయ్యేది!: ప్రియాంక

‘‘ఎన్నికల ప్రచారం ముగించుకుని ఆలస్యంగా ఇంటికి చేరుతుంటా. అయినా, ఓ తల్లిగా పిల్లల చేత హోమ్‌వర్క్‌ చేయించడానికి మాత్రం సమయం కేటాయిస్తుంటా. ఒక్కోసారి ఉదయం 3-4 కూడా అవుతుంది. నా పిల్లలకే కాదు..‘ఆంటీ’ అంటూ వచ్చే వేరే వాళ్ల పిల్లలకు కూడా హోమ్‌వర్క్‌ విషయంలో సాయం చేస్తుంటా’’ అని ప్రియాంక వివరించారు.

Updated : 20 Jan 2022 05:16 IST

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా. ఈ విషయంలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. కింది స్థాయి నాయకులకు, కార్యకర్తలకు ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తున్నారు. పోలింగ్‌కు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో వీలైనన్ని ఎక్కువ గంటలు పార్టీ వ్యవహారాలు చూసుకోవాల్సిన పరిస్థితి. ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ పిల్లల చేత హోమ్‌వర్క్‌ చేసే విషయంలో సాయపడతా అంటున్నారు ప్రియాంక గాంధీ వాద్రా. ఓ తల్లిగా ఒక్కోసారి ఉదయం 3-4 గంటల వరకు వారికి సాయపడుతుంటానని ఫేస్‌బుక్‌ వేదికగా నిర్వహించిన లైవ్‌ సెషన్‌లో చెప్పుకొచ్చారు.

‘మీ పిల్లల హోమ్‌వర్క్‌ విషయంలో మీరు సహాయపడుతుంటారా?’ అని ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు ప్రియాంక ఈ విధంగా బదులిచ్చారు. ‘‘ఎన్నికల ప్రచారం ముగించుకుని ఆలస్యంగా ఇంటికి చేరుతుంటా. అయినా, ఓ తల్లిగా పిల్లల చేత హోమ్‌వర్క్‌ చేయించడానికి మాత్రం సమయం కేటాయిస్తుంటా. ఒక్కోసారి ఉదయం 3-4 కూడా అవుతుంది. నా పిల్లలకే కాదు..‘ఆంటీ’ అంటూ వచ్చే వేరే వాళ్ల పిల్లలకు కూడా హోమ్‌వర్క్‌ విషయంలో సాయం చేస్తుంటా’’ అని ప్రియాంక వివరించారు. ప్రియాంకకు మిరయా వాద్రా (18), రిహాన్‌ వాద్రా (20) అనే కుమార్తె, కుమారుడు ఉన్నారు.

అలాగే, చిన్నతనంలో కొన్ని సరదా సంఘటనలను కూడా ఫేస్‌బుక్‌ సెషన్‌లో గుర్తుచేసుకున్నారు ప్రియాంక. చిన్నతనంలో సోదరుడు రాహుల్‌ గాంధీ, తాను విపరీతంగా పోట్లాడుకునే వాళ్లమని చెప్పారు. అయితే ఎవరైనా తమ జోలికొస్తే మాత్రం ఒక్కటైపోయేవాళ్లమని తెలిపారు. నాన్నమ్మ ఇందిరాగాంధీ హత్యకు గురైన సమయంలో తాను, తన సోదరుడు చాలా రోజుల పాటు స్కూలుకు వెళ్లకుండా ఇంటికే పరిమితమవ్వాల్సి వచ్చిందని చెప్పారు. చదువంతా ఇంట్లోనే సాగిందని, పరీక్షలు సైతం ఇంట్లోనే రాయాల్సి వచ్చిందని ఆనాటి సంఘటనలను గుర్తుచేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని