UP Politics: ఉత్తర్‌ ప్రదేశ్‌లో వేడెక్కిన రాజకీయం 

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఉత్తర్‌ ప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

Updated : 14 Oct 2021 12:33 IST

క్రియాశీలకంగా ప్రియాంక 
ఆమెపై భాజపా విమర్శల వర్షం 

ఈనాడు, లఖ్‌నవూ: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఉత్తర్‌ ప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు పదునెక్కుతున్నాయి. లఖింపురి ఖేరి ఘటన నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా యూపీలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆమె రైతుల సమస్యలను లేవనెత్తిన విధానం, పోరాడిన తీరు పార్టీ శ్రేణులతో పాటు సాధారణ ప్రజానీకాన్నీ బాగా ఆకట్టుకుందని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. అయితే- ప్రియాంక ప్రభావాన్ని నిలువరించడానికి భాజపా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఆమెపై పదేపదే విమర్శలు గుప్పిస్తోంది. ఈ నెల 10న వారణాసిలో ర్యాలీ సందర్భంగా ప్రియాంక కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించడం, లఖింపురి ఖేరి ఘటనకు నిరసనగా లఖ్‌నవూలో మౌనదీక్ష చేపట్టినప్పుడు ఆమె మెడలో రుద్రాక్ష దండ కనిపించడం వంటి విషయాలను కమలనాథులు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఎన్నడూ హిందుత్వ మాట ఎత్తని ప్రియాంకకు ఇప్పుడు మాత్రం దానిపై ఎందుకంత మమకారం కలిగిందని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్‌ నేతలకు హిందుత్వం గుర్తుకొస్తుందని విమర్శిస్తున్నారు.

కాంగ్రెస్‌ నేతలు మాత్రం ఈ విమర్శలను కొట్టిపారేస్తున్నారు. యూపీలో ప్రియాంక చురుగ్గా వ్యవహరిస్తుండటంతో భాజపా నాయకులు కలవరపాటుకు గురవుతున్నారని చెబుతున్నారు. అందుకే ప్రతి విషయాన్నీ భూతద్దంలో చూస్తూ ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు. లఖింపురి ఖేరి మృతుల కుటుంబాలకు భాజపా పరామర్శ లఖింపురి ఖేరి ఘటనలో మృత్యువాతపడ్డ తమ పార్టీ కార్యకర్తలు హరిఓం మిశ్ర, శుభం మిశ్రల కుటుంబాలను ఉత్తర్‌ ప్రదేశ్‌ మంత్రి బ్రిజేష్‌ పాఠక్‌ పరామర్శించారు. అన్నివిధాలా అండగా ఉంటామని మృతుల కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. మృతులిద్దరూ బ్రాహ్మణ వర్గానికి చెందినవారే కావడంతో.. ఆ వర్గం ఓటర్లను భాజపా వైపు తిప్పుకొనేందుకే పాఠక్‌ పరామర్శకు వెళ్లారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని