అసెంబ్లీలో పయ్యావుల × బుగ్గన

మూడు రాజధానుల అంశంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా తెదేపా, వైకాపా మధ్య వాగ్వాదం నెలకొంది. తెదేపా సభ్యుడు పయ్యావుల కేశవ్‌, ఆర్థిక మంత్రి బుగ్గన మధ్య అమరావతి...

Published : 20 Jan 2020 18:58 IST

అమరావతి: మూడు రాజధానుల అంశంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా తెదేపా, వైకాపా మధ్య వాగ్వాదం నెలకొంది. తెదేపా సభ్యుడు పయ్యావుల కేశవ్‌, ఆర్థిక మంత్రి బుగ్గన మధ్య అమరావతి భూములపై మాటల యుద్ధం జరిగింది. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ వైకాపా నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై పయ్యావుల మండిపడ్డారు. బినామీ ఆస్తులంటూ వైకాపా నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బినామీ చట్టం కింద ఆ ఆస్తులను కేంద్రానికి అటాచ్‌ చేద్దామా? అని ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు. అమరావతిలో ఓ ఇల్లు ఉండాలని భూమి కొనడం తప్పా? అని ప్రశ్నించారు. అమరావతిని మార్చాలనే ఆలోచనతోనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన కుమారుల పేరుతోనే భూమి కొన్నానని, బినామీ పేర్లతో కాదన్నారు. మీరు చెబుతున్న బినామీ భూముల జాబితాను కేంద్రానికి పంపి, ఆ భూములు అమ్మి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఇవ్వాలని పయ్యావుల డిమాండ్‌ చేశారు. బినామీ ఆస్తులను అటాచ్‌ చేయాలని కోరితే ప్రభుత్వానికి ఉలుకెందుకు అని ప్రశ్నించారు. 

దీనిపై ఆర్థిక మంత్రి బుగ్గన స్పందిస్తూ.. ఒక ఇల్లు కట్టుకోవడానికి అంత భూమి అవసరమా? అని ప్రశ్నించారు. డిసెంబర్‌లో సీఆర్‌డీఏ బిల్లు ఆమోదం పొందితే అంతకుముదే ఎలా భూములు కొన్నారని ప్రశ్నించారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని వ్యాఖ్యానించారు. మధ్యలో మరో మంత్రి బొత్స జోక్యం చేసుకుని ఇల్లు కట్టుకోవడానికి 4 ఎకరాలు అవసరమా అని ప్రశ్నించారు. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిన మాట వాస్తవమన్నారు. తెదేపా నేతలు తప్పు చేశామని అంగీకరించాలన్నారు. అనంతర మళ్లీ పయ్యావుల మాట్లాడుతూ విచారణ జరిపితే వాస్తవాలు తేలుతాయన్నారు. అసెంబ్లీలో ఉదయం నుంచి సుమారు 7 గంటలకు పైగా మాట్లాడుతున్న అధికార పార్టీ నేతలు.. తాను మాట్లాడిన కేవలం అరగంటకే ఆరేడు సార్లు నిల్చుని అడ్డుపడుతున్నారని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని