UP Election 2022: లంచం ఇవ్వలేకపోయా.. కాంగ్రెస్‌కు స్టార్‌ క్యాంపెయినర్‌ గుడ్‌ బై..!

యూపీ మహిళా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షురాలు పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది. ‘లడ్‌కీ హూ.. లడ్‌ సక్‌తీ హూ’ (నేను బాలికను.. అయినా పోరాడగలను..) అంటూ ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో......

Published : 20 Jan 2022 01:53 IST

లఖ్‌నవూ: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఉత్తర్‌ప్రదేశ్‌ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. టికెట్‌ ఆశించి భంగపాటుకు గురైన కొందరు పార్టీలు మారుతున్నారు. యూపీ మహిళా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షురాలు సైతం ఇదే బాటలో పయనించనున్నట్లు తెలుస్తోంది. ‘లడ్‌కీ హూ.. లడ్‌ సక్‌తీ హూ’ (నేను బాలికను.. అయినా పోరాడగలను..) అంటూ ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ప్రచారం చేస్తూ.. ప్రజల చూపును తనవైపు తిప్పుకున్న యూపీ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షురాలు ప్రియాంక మౌర్య పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది. టికెట్‌ దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన ప్రియాంక కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరనున్నట్లు సమాచారం.

కాంగ్రెస్‌ టికెట్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని ప్రియాంక మౌర్య బహిరంగంగానే ఆరోపించారు. ‘నా పేరును , నా 10 లక్షల మంది సోషల్ మీడియా ఫాలోవర్లను కాంగ్రెస్‌ వాడుకుంది. కానీ, రానున్న ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చేందుకు మాత్రం నిరాకరించింది. ఇది అన్యాయం. కావాలనే ఇలా చేశారు. నేను ఓబీసీ మహిళను కాబట్టే నాకు టికెట్‌ ఇవ్వలేదు’ అని వాపోయారు. టికెట్‌ కోసం కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ కార్యదర్శి సందీప్ సింగ్‌కు లంచం ఇవ్వలేకపోయానని కూడా ఆమె ఆరోపించారు.

యూపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. పార్టీల్లో అసమ్మతులు, చేరికలు ఊపందుకున్నాయి. సమాజ్‌వాదీ పార్టీకి షాకిస్తూ.. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌ కోడలు అపర్ణ యాదవ్‌ బుధవారం భారతీయ జనతా పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ములాయం చిన్న కుమారుడు ప్రతీక్‌ సతీమణి అపర్ణ భాజపా తీర్థం పుచ్చుకున్నారు. దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్‌ నేతలు ఆమెకు కండువా కప్పి భాజపాలోకి ఆహ్వానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని