Assembly elections 2022: ఎన్నికలర్యాలీలపై ఈ నెల 31వరకు నిషేధం

దేశవ్యాప్తంగా కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతున్న వేళ 5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రాష్ట్రాల్లో కొవిడ్ వ్యాప్తి జరగకుండా......

Published : 22 Jan 2022 21:30 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతున్న వేళ 5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రాష్ట్రాల్లో కొవిడ్ వ్యాప్తి జరగకుండా ఇప్పటికే అమలులో ఉన్న నిషేధాజ్ఞల్ని మరోసారి పొడిగించింది. అయితే, కొన్ని సడలింపులు ఇచ్చింది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ర్యాలీలు, రోడ్‌షోలను ఈ నెల 31 వరకు నిషేధిస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే, తొలి విడత ఎన్నికలకు రాజకీయ పార్టీల/పోటీలో ఉన్న అభ్యర్థులు జనవరి 28 నుంచి బహిరంగ సభలకు అనుమతించింది. అలాగే, రెండో దశ ఎన్నికలకు ఫిబ్రవరి 1నుంచి బహిరంగ సభలకు అనుమతిస్తున్నట్టు స్పష్టంచేసింది. ఇంటింటి ప్రచారంలో పాల్గొనేవారి సంఖ్యను ఐదు నుంచి 10మందికి పెంచింది. నిర్దేశించిన బహిరంగ ప్రదేశాల్లో ప్రచారం కోసం కొవిడ్‌ నిబంధనలతో వీడియో వ్యాన్‌లను అనుమతించనున్నట్టు ఈసీ తెలిపింది. 

ఎన్నికలు జరగనున్న ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, పంజాబ్‌, మణిపూర్‌ రాష్ట్రాల్లో బహిరంగ సభలు, ర్యాలీలపై గతంలో ఈసీ విధించిన నిషేధం నేటితో ముగిసింది. దీంతో భౌతిక ర్యాలీలు, రోడ్‌షోలపై నిషేధాన్ని మళ్లీ పొడిగించాలా? వద్దా అనే అంశంపై అధికారులు వర్చువల్‌గా సమీక్షించారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ, వైద్యరంగ నిపుణులు, రాష్ట్రాల్లో ఎన్నికల కమిషనర్లతో సమాలోచనలు జరిపి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకు ఈసీ జనవరి 8న షెడ్యూల్‌ ప్రకటించింది. అదే సమయంలో ఒమిక్రాన్‌ విజృంభణతో భౌతిక ర్యాలీలు, రోడ్‌షోలు, బైక్‌ ర్యాలీలు వంటి ప్రచార కార్యక్రమాలపై జనవరి 15వరకు నిషేధం విధించింది. ఆ తర్వాత కేసులు అదుపులోకి రాకపోగా మరింతగా పెరుగుతుండటంతో ఆ నిషేధాన్ని జనవరి 22 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాజకీయ పార్టీలు 300 మందికి మించకుండా/50శాతం ఆక్యుపెన్సీతో ఇండోర్‌ సమావేశాలు నిర్వహించుకొవచ్చంటూ వెసులుబాటు కల్పించింది. అయితే, నేటితో ఆ నిషేధం ముగియడంతో తాజా పరిస్థితుల్ని సమీక్షించిన ఈసీ ఈ నిర్ణయం ప్రకటించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని