Money laundering: అనిల్‌ దేశ్‌ముఖ్‌, ఆయన తనయుడికి ఈడీ సమన్లు

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి, ఎన్సీపీ నేత అనిల్‌ దేశ్‌ముఖ్‌, ఆయన కుమారుడు హృషికేశ్‌లకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తాజాగా మళ్లీ సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్‌ కేసులో......

Published : 31 Jul 2021 01:02 IST

ముంబయి: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి, ఎన్సీపీ నేత అనిల్‌ దేశ్‌ముఖ్‌, ఆయన కుమారుడు హృషికేశ్‌లకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తాజాగా మళ్లీ సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్‌ కేసులో సోమవారం విచారణకు హాజరు కావాలని సూచించింది. ఆగస్టు 2న హాజరుకానున్న వీరిద్దరినీ మనీలాండరింగ్‌కు సంబంధించి ప్రశ్నించనున్నట్టు అధికారులు తెలిపారు. మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు అనిల్‌ దేశ్‌ముఖ్‌పై సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ.. ఇప్పటికే ఆయనకు మూడు సార్లు సమన్లు జారీ చేసినా స్పందించలేదు. ఆయన కొడుకు, సతీమణికి కూడా విచారణకు రాలేదు. దీంతో ఇటీవల నాగ్‌పూర్‌లోని ఆయన నివాసంపై ఈడీ దాడులు జరిపి రూ.4కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసింది. 

ముంబయిలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.వంద కోట్లు వసూలు చేయాలంటూ సస్పెండైన పోలీసు అధికారి సచిన్‌ వాజేను అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఆదేశించినట్లు ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరంవీర్‌ సింగ్‌ గతంలో ఆరోపించారు. పోలీసు అధికారుల బదిలీల్లోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. వీటిపై విచారణకు ఆదేశించాలని కోరుతూ పరంవీర్‌ సింగ్‌ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారించిన కోర్టు.. ఈ ఆరోపణలపై దర్యాప్తు జరపాలని సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని