Goa polls 2022: భాజపాకు మరో షాక్‌.. పార్టీని వీడనున్న మాజీ సీఎం

మరికొద్ది రోజుల్లో గోవాలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు భాజపాకు మరో పెద్ద షాక్​ తగిలింది. మాజీ సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్​ (65) పార్టీని వీడనున్నట్లు ప్రకటించారు......

Published : 22 Jan 2022 16:51 IST

పనాజీ: మరికొద్ది రోజుల్లో గోవాలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు భాజపాకు మరో పెద్ద షాక్​ తగిలింది. గోవా మాజీ సీఎం మనోహర్‌ పారికర్‌ తనయుడు ఉత్పల్‌ పారికర్‌ నిన్న భాజపాకు గుడ్‌బై చెప్పగా.. మరో మాజీ సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్​ (65) పార్టీని వీడనున్నట్లు శనివారం ప్రకటించారు. గోవా ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు టికెట్ ఇవ్వలేదని అందువల్లే రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు.

‘భాజపాలో కొనసాగాలని లేదు. ఇప్పటికైతే నేను పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా. తర్వాత ఏం చేయాలో త్వరలో నిర్ణయించుకుంటా’ అని పర్సేకర్ పేర్కొన్నారు. 2002 నుంచి 2017 వరకు పర్సేకర్ ప్రాతినిథ్యం వహించిన మండ్రేమ్​ అసెంబ్లీ స్థానంలో ఎమ్మెల్యే దయానంద్​ సోప్టేను భాజపా బరిలోకి దింపనుంది. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన సోప్టే.. పర్సేకర్​పై గెలుపొందారు. అనంతరం 2019లో భాజపాలో చేరారు. లక్ష్మీకాంత్ పర్సేకర్ 2014-17 వరకు గోవా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఈ ఎన్నికల్లో భాజపా మేనిఫెస్టో కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారు.

ఇదిలా ఉంటే.. ఉత్పల్‌ పారికర్‌ శుక్రవారం భాజపాకు వీడ్కోలు పలికారు. తన తండ్రి నేతృత్వం వహించిన పనాజీ స్థానం నుంచి ఎన్నికల్లో నిలబడాలని భావించగా.. భాజపా టికెట్‌ కేటాయించకపోవడంతోనే ఉత్పల్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పనాజీ నుంచి స్వతంత్రంగానే పోటీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ‘పార్టీ సభ్యుల మద్దతుతోపాటు, పనాజీ ప్రజల ఆదరాభిమానాలు నాకు లభిస్తున్నాయి. అయినా పార్టీ (భాజపా) నాకు పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వలేదు. రెండేళ్ల క్రితం పార్టీలో చేరిన మరో వ్యక్తికి టికెట్‌ ఇచ్చారు. అందుకే ఒంటరిగా పోరాడేందుకు సిద్ధమయ్యా’ అని విలేకర్ల సమావేశంలో ఉత్పల్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని