భాజపా వైఖరితో ఆహార సంక్షోభం మొదలైంది..!

రైతు సంఘాలు తీవ్రంగా నిరసిస్తూ ఆందోళన కొనసాగిస్తున్న వ్యవసాయ చట్టాలపై భాజపా మొండిగా వైఖరితో దేశంలో ఆహార సంక్షోభం మొదలైందని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా ......

Updated : 11 Jan 2021 16:44 IST

రానాఘాట్‌: రైతులు తీవ్రంగా నిరసిస్తూ ఆందోళన కొనసాగిస్తున్న వ్యవసాయ చట్టాలపై భాజపా మొండి వైఖరితో దేశంలో ఆహార సంక్షోభం మొదలైందని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. సోమవారం ఆమె నాదియా జిల్లాలో ఓ ర్యాలీలో మాట్లాడారు. మరికొద్ది నెలల్లోనే బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ దీదీ.. భాజపాను లక్ష్యంగా చేసుకొని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇతర రాజకీయ పార్టీల నేతల ఫిరాయింపులను ప్రోత్సహిస్తోన్న భాజపా.. దేశంలోనే ఓ పెద్ద జంక్‌ పార్టీలా మారిందంటూ వ్యాఖ్యానించారు. అవినీతికి పాల్పడిన, కుళ్లిపోయిన నేతలను చేర్చుకుంటోందని ఎద్దేవా చేశారు.  సాగు చట్టాలపై భాజపా ప్రభుత్వం మొండి పట్టు వీడకపోతే దేశంలో ఆహార కొరత ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశానికి రైతులే ఆస్తి అని, వారి ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలూ తీసుకోరాదని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి కొందరు నేతలు భాజపాలోకి వెళ్లారన్న దీదీ.. ప్రజాధనాన్ని లూటీ చేసి రక్షణ కోసమే వాళ్లు అలా చేశారన్నారు. బెంగాల్‌ ఎన్నికల్లో భాజపా గెలవకపోతే ఆ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతుదారుల్లాగే వ్యవహరిస్తారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

ఇదీ చదవండి..

కరోనా ఎఫెక్ట్‌: తొలిసారి బడ్జెట్‌ ప్రతులు లేకుండా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని