Punjab congress: 2022 ఎన్నికలకు ఆయనే ‘కెప్టెన్‌’.. పంజాబ్‌ పరిణామాలపై హరీశ్‌ రావత్‌

Punjab crisis: పంజాబ్‌ 2022లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు కెప్టెన్‌ అమరీందర్‌ సారథ్యం వహిస్తారని ఆ పార్టీ పంజాబ్‌ ఇన్‌చార్జి హరీశ్‌ రావత్‌ ప్రకటన చేశారు.

Published : 26 Aug 2021 01:20 IST

దిల్లీ (Delhi): పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ (Amarinder Singh)పై తిరుగుబావుటా ఎగిరిన నేపథ్యంలో కాంగ్రెస్‌ (Congress) పార్టీ కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు కెప్టెనే పార్టీకి సారథ్యం వహిస్తారని ఆ పార్టీ పంజాబ్‌ ఇన్‌ఛార్జి హరీశ్‌ రావత్‌ ప్రకటన చేశారు. అమరీందర్‌ను వ్యతిరేకిస్తూ నలుగురు కేబినెట్‌ మంత్రులు బుధవారం హరీశ్‌ రావత్‌ను దేహ్రాదూన్‌లో కలిసిన అనంతరం ఆయన నుంచి ఈ ప్రకటన వెలువడింది. ఇటీవలి పలు పరిణామాలతో కెప్టెన్‌, సిద్ధూ (Sidhu) వర్గాల మధ్య పోటాపోటీ నెలకొన్న వేళ కెప్టెన్‌కు మద్దతుగా ఈ ప్రకటన వెలువడడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అమరీందర్‌ సింగ్‌పై నలుగురు మంత్రులు, 32 మంది కాంగ్రెస్‌ శాసనసభ్యులు తిరుగుబావుటా ఎగరేసిన సంగతి తెలిసిందే. 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేసిన ముఖ్యమైన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో సీఎం విఫలమయ్యారని, ఆయనపై తమకు నమ్మకం లేదని మూకుమ్మడిగా ప్రకటించారు. మంత్రి తృప్త్‌ రాజీందర్‌ సింగ్‌ బజ్వా నివాసంలో మంగళవారం వీరంతా సమావేశమైన అనంతరం ఈ ప్రకటన చేశారు. ఈ క్రమంలో బుధవారం అసంతృప్త మంత్రులైన బజ్వా, సుఖ్‌బీందర్‌ సింగ్‌ సర్కారియా, సుఖ్జీందర్‌ సింగ్‌ రంధ్వా, చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ హరీశ్‌ రావత్‌ను కలిశారు. మున్ముందు పంజాబ్‌ (Punjab) రాజకీయాలు మరింత రసవత్తరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని