TS News: హుజూరాబాద్‌ ఓటమిపై కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు

గాంధీభవన్‌లో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పలు అంశాలు చర్చకొచ్చాయి. హుజూరాబాద్ ఓటమి, పార్టీ సభ్యత్వ నమోదు, డిసెంబర్ 9న నిర్వహించనున్న...

Updated : 03 Nov 2021 19:42 IST

హైదరాబాద్‌: గాంధీభవన్‌లో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పలు అంశాలు చర్చకొచ్చాయి. హుజూరాబాద్ ఓటమి, పార్టీ సభ్యత్వ నమోదు, డిసెంబర్ 9న నిర్వహించనున్న భారీ బహిరంగ సభ తదితర అంశాలపై రాజకీయ వ్యవహారాల కమిటీ చర్చించింది. హుజూరాబాద్‌ ఓటమిపై నాయకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ వ్యవహారాల రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్‌ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కీ, వీహెచ్‌, షబ్బీర్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

కోమటిరెడ్డి సోదరులు కలిసి రావాలి: వీహెచ్‌

హుజూరాబాద్‌లో ఘోర పరాజయంపై అంతర్గతంగా విచారణ జరిపించాలని కోరినట్టు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు తెలిపారు. భాజపాకు కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు తరలివెళ్లడం జీర్ణించుకోలేకపోతున్నామని, తాను అన్నం కూడా తినలేదని చెప్పారు. రేవంత్‌రెడ్డి అధ్యక్షుడు అయ్యాక పార్టీకి దూరంగా ఉంటున్న కోమటిరెడ్డి సోదరులతో మాట్లాడి కలిసి పని చేసేందుకు ఒప్పిస్తానని వీహెచ్‌ తెలిపారు. కోమటిరెడ్డి సోదరులు పార్టీ కోసం కలిసి రావాలన్నారు.

ప్రాణం పోయినా భాజపాతో పొత్తు పెట్టుకోం: మధుయాష్కీ

ప్రాణం పోయినా భాజపాతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోదని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌ అన్నారు. గాంధీభవన్‌ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘ హుజూరాబాద్‌ ఉపఎన్నిక పెట్టుబడిదారుల మధ్య జరిగిన ఎన్నిక. ఈటల రాజేందర్‌ ఆత్మగౌరవ ఎన్నిక కాదు.. అక్రమార్జనను కాపాడుకునే ఎన్నిక. రబ్బరు చెప్పులతో తిరిగే  తెరాస నేతలకు రూ.వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి. హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఫలితంతో మేం కుంగిపోవడం లేదు. కాంగ్రెస్‌ నేతలు బహిరంగంగా మాట్లాడొద్దని మాణికం ఠాగూర్‌ ఆదేశించారు. పార్టీ విషయాలు పీఏసీలో మాట్లాడాలని సూచించారు’’ అని మధుయాష్కీ తెలిపారు.

పార్టీ విషయాలు మీడియాతో మాట్లాడనని మాటిచ్చా: జగ్గారెడ్డి

‘‘మనసులో ఉన్న ఆవేదన అంతా చెప్పా. పార్టీకి సంబంధించిన అనేక అనుమానాలు పీఏసీలో లేవనెత్తా. బయట ఎంత తీవ్రంగా మాట్లాడానో.. లోపల కూడా అలాగే మాట్లాడా. లోపల ఏం జరిగిందనేది చెప్పను. పీసీసీ, సీఎల్పీ నేత, ఠాగూర్‌లను గౌరవిస్తాం. వాళ్లు సోనియాగాంధీ దూతలు. తొందరపడి ఠాగూర్‌ విషయంలో నోరు జారినా వెనక్కి తీసుకుంటా. ఎవరినీ ఇబ్బంది పెట్టాలని నాకు లేదు. పార్టీకి ఏదైనా కష్టం, నష్టం అనిపించే విషయాలు నా దృష్టికి వచ్చినా బయటకు మాట్లాడను. 2023 ఫలితాలు వచ్చే వరకు పార్టీ వ్యవహారాలపై మీడియాతో మాట్లాడనని ఠాగూర్‌కి మాటిచ్చా’’ అని జగ్గారెడ్డి తెలిపారు.

14 నుంచి ప్రజా చైతన్య యాత్ర

ఈనెల 14 నుంచి 21 వరకు ప్రజా చైతన్య యాత్ర నిర్వహించనున్నట్టు సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ తెలిపారు. రైతు సమస్యలు-పోడు సమస్య, పెట్రో ధరలపై పోరాటం ఉంటుందన్నారు. ‘‘హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితంపై పీఏసీ అభిప్రాయ సేకరణ జరిగింది. హుజూరాబాద్‌ ఫలితంపై రివ్యూ కమిటీ వేయబోతున్నాం. ఈ ఉప ఎన్నిక పార్టీల మధ్య కాదు.. కేసీఆర్‌-ఈటల వ్యక్తిగత గొడవ. కమీషన్లు, భూముల కోసం ఈటల, కేసీఆర్‌ మధ్య గొడవ మొదలైంది. హుజూరాబాద్‌లో కేసీఆర్‌ రూ.600 కోట్లు, ఈటల రూ.300 కోట్లు ఖర్చు చేశారని ప్రచారం జరిగింది. హుజూరాబాద్‌ గెలుపు ఈటల వ్యక్తిగతం.. భాజపాది కాదు’’ అని షబ్బీర్‌ అలీ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని