బిహార్‌ ప్రజలే నా కుటుంబం: నితీశ్‌ కుమార్‌

బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ ఎన్నికల ప్రచారంలో చురుకుగా దూసుకెళ్తున్నారు. ఓవైపు తాము చేసిన అభివృద్ధిని వివరిస్తూనే.. మరోవైపు ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. మంగళవారం రెండో వర్చువల్‌ ర్యాలీలో పాల్గొన్న నీతీశ్‌ రాష్ట్రంలో రిజర్వేషన్ల ద్వారా తమ ప్రభుత్వం వెనకబడిన వర్గాల ఆదుకున్న విషయాన్ని గుర్తుచేశారు.

Published : 14 Oct 2020 01:53 IST

పట్నా: బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ ఎన్నికల ప్రచారంలో చురుకుగా దూసుకెళ్తున్నారు. ఓవైపు తాము చేసిన అభివృద్ధిని వివరిస్తూనే.. మరోవైపు ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. మంగళవారం రెండో వర్చువల్‌ ర్యాలీలో పాల్గొన్న నితీశ్‌ రాష్ట్రంలో రిజర్వేషన్ల ద్వారా తమ ప్రభుత్వం వెనకబడిన వర్గాలను ఆదుకున్న విషయాన్ని గుర్తుచేశారు.  ‘మా ప్రభుత్వ హయాంలో బీసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయ సేవల కోసం 50శాతం రిజర్వేషన్లు కేటాయించాం. స్థానిక ఎన్నికల్లోనూ ఈబీసీ (ఆర్థికంగా వెనకబడిన కులాల)వారికి రిజర్వేషన్లను కల్పించాం. ప్రతిపక్షాలు ఈ నిర్ణయాల్ని వ్యతిరేకించాయి. కొందరైతే ఏకంగా న్యాయస్థానాలను ఆశ్రయించారు. కానీ చివరకు ఆ నిర్ణయాలు సరైనవేనని మేం నిరూపించాం. సామాజికంగా వెనబడిన వర్గాల వారికి ఉద్యామీ యోజన పథకం ద్వారా ఆర్థిక సాయం చేశాం’అని తెలిపారు. 

మహిళల రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ.. ‘మహిళల్లో సాధికారత తెచ్చేందుకు పంచాయతీ, సహకార సంఘాల్లో వారికి 50శాతం రిజర్వేషన్లు కల్పించాం. పాఠశాల విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేసినప్పుడు కూడా ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు చేశాయి. మేం అధికారంలోకి వచ్చినపుడు 9వతరగతి బోర్డు పరీక్షలకు లక్ష మంది బాలికలు మాత్రమే హాజరయ్యారు. కానీ తాజాగా నిర్వహించిన బోర్డు పరీక్షల్లో 9లక్షలకు పైగా బాలికలు పరీక్షలకు హాజరయ్యారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీసు శాఖలో మహిళలకి అవకాశాలు కల్పించాం. కేవలం రిజర్వేషన్ల కారణంగానే ఇది సాధ్యమైంది’ అని  పేర్కొన్నారు.

ఎన్డీయే కూటమి తిరిగి అధికారంలోకి వస్తే బాలికలకు పాఠశాల విద్య పూర్తి చేసిన బాలికలకు రూ.25వేలు, కళాశాల విద్య పూర్తి చేసిన బాలికలకు రూ.50వేలు ఇస్తామని ఇదివరకే హామీ ఇచ్చారు. అదేవిధంగా భగల్పూర్‌ అల్లర్లలో నష్టపోయిన మైనారిటీలకు సైతం తమ ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకుందని చెప్పారు. గతంలో రాష్ట్రాన్ని పాలించిన నాయకులు మైనారిటీల ఓట్లు ఉపయోగించుకున్నారు కానీ.. వారి కోసం ఏం చేయలేదని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలకు వారి కుటుంబమే ముఖ్యం.. కానీ నాకు మాత్రం బిహార్‌ ప్రజలే కుటుంబసభ్యులు అని వెల్లడించారు. బిహార్‌ శాసనసభకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు