అకాలీదళ్‌ చీఫ్‌ బాదల్‌ కాన్వాయ్‌పై రాళ్ల దాడి!

పంజాబ్‌లోని జలాలబాద్‌లో శిరోమణి అకాలీదళ్‌(ఎస్‌ఏడీ) చీఫ్‌ సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ వాహనంపై కొందరు వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడడం ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ తమ అభ్యర్థుల నామినేషన్‌ కార్యక్రమానికి వెళ్తుండగా..

Updated : 02 Feb 2021 16:56 IST

ఛండీగఢ్‌: పంజాబ్‌లోని జలాలబాద్‌లో శిరోమణి అకాలీదళ్‌(ఎస్‌ఏడీ) చీఫ్‌ సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ వాహనంపై కొందరు వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడడం ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ తమ అభ్యర్థుల నామినేషన్‌ కార్యక్రమానికి వెళ్తుండగా.. ఆయన కాన్వాయ్‌పై కొందరు వ్యక్తులు రాళ్లతో దాడికి దిగారు. వెంటనే బాదల్‌ను రక్షించేందుకు అకాలీదళ్‌ నేతలు సైతం రంగంలోకి దిగే సరికి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే ఈ దాడికి అధికార కాంగ్రెస్‌ పార్టీయే కారణమని ఆరోపిస్తూ అకాలీదళ్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

‘ఎస్‌ఏడీ చీఫ్‌ సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ కాన్వాయ్‌పై అధికార కాంగ్రెస్‌ పార్టీ నాయకులు దాడికి దిగారు. ఈ క్రమంలో  కార్యకర్తలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాదల్‌ను దాడి నుంచి రక్షించారు. ఈ ఘర్షణలో కొందరు మా పార్టీ కార్యకర్తలపై తుపాకీ కాల్పులు కూడా జరిపారు. బాదల్‌ రక్షించడానికి వెళ్లిన మా కార్యకర్తల్లో ముగ్గురికి బుల్లెట్‌ గాయాలయ్యాయి. బాదల్‌కు ఎలాంటి హాని జరగలేదు’ అని అకాలీదళ్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది.  

అధికార కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రామిందర్‌ సింగ్‌ అల్వా కుమారుడి నేతృత్వంలోనే అకాలీనేతలపై ఈ దాడులు జరిగినట్లు బాదల్‌ మీడియా సలహాదారుడు జంగ్‌వీర్‌ సింగ్‌ ఆరోపించారు. బాదల్‌ వాహనంపై కాంగ్రెస్‌ కార్యకర్తలు రాళ్లతో దాడి చేసినట్లు చెప్పారు. తుపాకీతో కాల్పులు కూడా జరపగా.. ఇందులో ముగ్గురు అకాలీ కార్యకర్తలు గాయాల పాలయ్యారని వెల్లడించారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉన్నారని ఆరోపించారు. కాగా.. పంజాబ్‌లో ఫిబ్రవరి 14వ తేదీన 8 మున్సిపల్‌ కార్పొరేషన్లకు, 109 మున్సిపల్‌ కౌన్సిళ్లకు ఎన్నికలు జరగనున్నాయి. 

ఇదీ చదవండి

నా భర్త చదివిన పాఠశాల ఫొటో తీయండి!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని