Corona: సునామీ కన్నా ప్రమాదకరం: కేఏ పాల్‌

కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలో రాష్ట్రంలో పది, ఇంటర్‌ పరీక్షలు నిర్వహించడం అవివేకమే అవుతుందని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్‌ అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన..

Published : 29 Apr 2021 01:07 IST

విజయవాడ: కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలో రాష్ట్రంలో పది, ఇంటర్‌ పరీక్షలు నిర్వహించడం అవివేకమే అవుతుందని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్‌ అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పరీక్షల సమయంలో కరోనా సోకితే విద్యార్థుల ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా వేశారని.. ఏపీలోనూ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌, మంత్రులు ఇటువంటి పరిస్థితుల్లో వారి పిల్లల్ని పరీక్షలకు పంపుతారా?అని నిలదీశారు. ఏపీ హైకోర్టు పరీక్షల నిర్వహణపై సరైన నిర్ణయం తీసుకోకుంటే విద్యార్థులు కరోనాకు బలైపోయే ప్రమాదం ఉందని పాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

సునామీ కన్నా కరోనా వైరస్‌ ప్రమాదకరంగా మారిందని.. దేశవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని పాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయాల్లో బహిరంగ సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి కరోనా ప్రబలడానికి రాజకీయ నేతలు, ఎన్నికల సంఘం కారణమయ్యాయని మండిపడ్డారు. అదేవిధంగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అమ్మడంపై హైకోర్టులో పిటిషన్‌ వేసినట్లు ఆయన తెలిపారు. ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని