నా మాటలు వినిపించుకోలేదు: హర్‌సిమ్రత్‌

వ్యవసాయ బిల్లుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తన మాటలను పెడచెవిన పెట్టిందని ఆకాలీదళ్‌ నేత హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ అన్నారు. తన మాటలను కేంద్ర ప్రభుత్వం వినిపించుకోకపోవడం బాధగా ఉందని చెప్పారు. అందుకే.....

Published : 18 Sep 2020 19:42 IST

దిల్లీ: వ్యవసాయ బిల్లుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తన మాటలను పెడచెవిన పెట్టిందని అకాలీదళ్‌ నేత హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ అన్నారు. తన మాటలను కేంద్ర ప్రభుత్వం వినిపించుకోకపోవడం బాధగా ఉందని చెప్పారు. అందుకే మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని తెలిపారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఆమె తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో పీటీఐ వార్తా సంస్థకు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు.

‘‘అమ్మను ఐసీయూలో ఉంచి మరీ నా బాధ్యతగా ఈ మూడు బిల్లుల కోసం పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యా. రైతులకు మద్దతుగా నా వాణి వినిపించా. నా మాటలను పట్టించుకోకపోవడంతో మంత్రి పదవికి రాజీనామా చేశా’’ అని హర్‌సిమ్రత్‌ చెప్పారు. ఆర్డినెన్స్‌ల సమయంలోనూ తాను కేబినెట్‌లో ఈ అంశాన్ని లేవనెత్తానన్నారు. బిల్లులు తీసుకురావద్దని,  రైతుల్లో ఉన్న భయాలను పోగొట్టిన తర్వాతే తీసుకురావాలని సూచించినట్లు చెప్పారు. ‘‘కేబినెట్‌లో నా మాట వినలేదు. బిల్లులను సెలక్ట్‌ కమిటీకి పంపాలన్న డిమాండ్‌నూ పట్టించుకోలేదు. ఒకవేళ నా మాట పట్టించుకుని ఉంటే.. ఇవాళ రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసే పరిస్థితి నెలకొనేది కాదు’’ అని హర్‌సిమ్రత్‌ అన్నారు.

అన్నదాతలకు మరిన్ని ప్రయోజనాలు కల్పించడమే తమ లక్ష్యంగా పేర్కొంటూ కేంద్రం రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య (ప్రోత్సాహక, సులభతర) బిల్లు;  రైతుల (సాధికారత, రక్షణ) ధరల హామీ, సేవల ఒప్పంద బిల్లు; నిత్యావసర సరకుల(సవరణ) బిల్లులను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వీటికి లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులను కాంగ్రెస్‌ సహా విపక్షాలు వ్యతిరేకించాయి. ఎన్డీయేలో భాగస్వామి అయిన శిరోమణి అకాలీదళ్‌ కూడా ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసింది. మరోవైపు హర్‌సిమ్రత్‌ రాజీనామాను పంజాబ్‌ సీఎం అమరీందర్‌ డ్రామాగా అభివర్ణించారు. ఆ వ్యాఖ్యలను హర్‌సిమ్రత్‌ ఖండించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని